Sunday, May 5, 2024

బీసీ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. సోనియాగాంధీతో చర్చిస్తాం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ జనాభా గణనలో కులాలవారీగా బీసీ గణన చేపట్టడానికి, పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టడానికి, బీసీలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం టాగోర్ భరోసానిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ నేతృత్వంలో ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో గురువారం బీసీ నాయకులు వారిద్దరినీ కలిశారు. బీసీ బిల్లు ప్రాముఖ్యత, ఆవశ్యకత ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై రాజ్యసభ ప్లోర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్లోర్ లీడర్ అధిర్ రంజన్ చౌదరి జీరో అవర్‌లో చర్చించేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని, అవసరమైతే ఆమె అపాయింట్‌మెంట్ కూడా ఇప్పిస్తామని రేవంత్, మాణిక్యం టాగోర్ చెప్పారని దాసు సురేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ వంశీ చంద్‌రెడ్డి, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంగిశెట్టి జగదీశ్, బీసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ జక్కని సంజయ్ కుమార్, బొంగోని శ్రావణ్ కుమార్, వరాల అనిల్, చెరుకు శివ కుమార్, ఇటికాల రాజశేఖర్, గుడాల మహేష్ గౌడ్, గుర్రం సాయికుమార్, గొల్లపల్లి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement