Thursday, May 2, 2024

కార్యవర్గంపై కసరత్తు, కూర్పుపై ఫిర్యాదుల్లేవు ఖర్గేతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు రాజేసిన టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై తనకెలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు లేవని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గా రెడ్డి) అన్నారు. గురువారం సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన అనంతరం జగ్గా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఖర్గే ఏఐసీసీ అధ్యక్షులయ్యాక మర్యాదపూర్వకంగా కలవాలి కాబట్టి వచ్చి కలిశానని చెప్పారు. కలిసిన సందర్భంలో తెలంగాణలోని తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించానని అన్నారు. జగ్గారెడ్డిగా తన గురించి, తన రాజకీయ నేపథ్యం, ప్రాధాన్యతల గురించి వివరించానని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ఒకదానిపై ఒకటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేసుకుంటూ డ్రామా రాజకీయాలు చేస్తున్నాయని, తద్వారా కాంగ్రెస్ గురించి చర్చ లేకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

ఈ రెండు పార్టీలను ఎలా ఎదుర్కోవాలన్న అంశం గురించే పార్టీ అధినేతతో చర్చించానని అన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ పోరాటాలు చేసుకుంటున్నాయని తప్ప ప్రజల కోసం చేస్తున్నదేమీ లేదని అన్నారు. ఇకపోతే టీపీసీసీ కార్యవర్గం కూర్పుపై తనకెలాంటి ఫిర్యాదులు, అభ్యంతరాలు లేవని అన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్, రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శలు (సహ ఇంచార్జులు) కలిసి ఈ కసరత్తు చేశారని వివరించారు. అందరిని కలుపుకుని పోవాలన్నదే తన పద్ధతి అని, అదే మాట ఖర్గేకు చెప్పానని అన్నారు. ఇంతకు మించి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల గురించి ఖర్గేతో చర్చించలేదని తెలిపారు.

పార్టీలో అంతర్గత విబేధాలు, నేతల మధ్య స్పర్థల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రతి రాజకీయ పార్టీలో అంతర్గత సమస్యలు, నేతల మధ్య విబేధాలు ఉంటాయని, కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మిగతా పార్టీల్లో లేకపోవడం వల్ల అవి బయటపడవని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్ నెలకొందని అన్నారు.

- Advertisement -

జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు విజయం సాధించలేవు

ప్రాంతీయపార్టీలు జాతీయ పార్టీ హోదా పొందినప్పటికీ కూడా జాతీయ రాజకీయాల్లో విజయం సాధించలేకపోయాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఈ తరహా ప్రయత్నాలు చేసి విజయం సాధించలేకపోయానని, టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర సమితి; నుంచి ‘భారత్ రాష్ట్ర సమితి’గా పేరు మారడంపై స్పందిస్తూ ఏ పార్టీ దరఖాస్తు చేసుకున్నా ఎన్నికల సంఘం అనుమతిస్తుందని అన్నారు. జాతీయ పార్టీలుగా దేశంలో రెండే రెండున్నాయని, అవి కాంగ్రెస్, బీజేపీ మాత్రమేనని అన్నారు. ఇకపోతే మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ నష్టపోవడానికి కారణం ఎంఐఎం, ఇతర పార్టీలేనని సూత్రీకరించారు.

ఇదివరకెప్పుడూ హైదరాబాద్ నగరం దాటని ఎంఐఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పోటీ చేస్తోందని, చాలా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎంలు బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌ వైపు వెళ్లకుండా బీజేపీకి వెళ్లేలా కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ధన బలం, మీడియా బలంతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు, టిఆర్ఎస్ వచ్చినా పర్లేదు అన్నట్టుగా బీజేపీ సైతం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ రెండు పార్టీల కుట్రలను ప్రజలకు వివరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement