Sunday, April 28, 2024

TS | కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేయిస్తాం: కేసీఆర్

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్‌ఎస్‌ పార్టీ తీసుకుంటుందని అన్నారు. నేను ముఖ్యమంత్రికి… రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను… బోనస్ పేరు మీద మీరు తప్పించుకోలేరు. దానికి ఎన్నికల కమిషన్ అడ్డురాదు… మేం కూడా మీ పైన కంప్లయింట్ చేయబోం. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటారో అంత బోనస్ చిట్టీలు రాసివ్వండి. బోనస్ ఎగబెడతాం అంటే మాత్రం ఊరుకునేది లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు.

తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి ఇప్పుడు దానిని అమలు చేయడం లేదని, వాయిదా వేసిందని విమర్శించారు. మహిళలకు రూ.2500తో పాటు ఏ హామీని నెరవేరలేదన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకు వచ్చామని, అధికారంలోకి వచ్చాక తెలంగాణను అభివృద్ధి చేశామన్నారు. రైతుబంధు తీసుకువచ్చామన్నారు.

అధికారంలోకి వస్తే పంటకు బోనస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మనం ఉన్నప్పుడు రైతులు ధీమాగా ఉండేవారన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధులు పడేవని, ఇరవై నాలుగు గంటలు నీళ్ళిచ్చామన్నారు. నేను కడుపులో పెట్టుకొని కాపాడిన రైతులు ఈరోజు ఆగం అవుతున్నారన్నారు. పంట బోనస్‌కు అందరం కలిసి కొట్లాడుదామన్నారు. బీఆర్‌ఎస్‌కు బలమిస్తే రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్‌ను అవమానించింది..

అంబేద్కర్ పుణ్యం వల్లే తెలంగాణ వచ్చిందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. అంతటి మహనీయుడి జయంతి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను అవమానించిందని మండిపడ్డారు. అంబేద్కర్ ను అవమానించిన పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వామేనని… అందులో ఎందుకు కూర్చున్నారని కాంగ్రెస్ నేతలను కేసీఆర్ ప్రశ్నించారు.

- Advertisement -

ఇప్పుడే తెలంగాణకు బీఆర్ఎస్ ఎంపీలు అవసరమని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉంటే మన హక్కుల కోసం కొట్లాడుతారని, రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పొలీసులు జాగ్రత్తగా ఉండాలని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులు గురి చేయోద్దని సూచించారు. తాము అన్ని రికార్డు చేసి ఉంచుతున్నామని.. మళ్ళీ వచ్చేది తమ ప్రభుత్వమేనని ఆ విషయం పొలీసులు మరిచిపోవద్దని కేసీఆర్ హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement