Saturday, September 21, 2024

స్థానిక సమస్యలపైన కాంగ్రెస్ ఫోకస్‌.. ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకులు అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలతో పాటు ప్రధానంగా స్థానిక సమస్యలపైన ఎక్కడికక్కడనే ఫోకస్‌ పెట్టాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్య, ధాన్యం కొనుగోలు తదితరన ససమ్యలపై కాంగ్రెస్‌ వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని, రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌ తదితర అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలు చేపట్టింది. వీటన్నింటిపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించడమే కాకుండా నోటిఫికేషన్ల విడుదల, ధాన్యం కొనుగోలును ప్రభుత్వం చేపడుతుందని ప్రకటించారు. దీంతో ఈ రెండు అంశాలపై తీసుకున్న కార్యాచరణకు బదులు ఇతర అంశాలపై దృష్టి సారించాలని పీసీసీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై ఒక వైపు ఉద్యమిస్తూనే.. మరో వైపు అసెంబ్లి నియోజక వర్గాల్లోని సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని ఆలోచనలో ఉన్నారు.

నియోజక వర్గాల్లోని నాయకత్వలోపాలపైన దృష్టి..

పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్‌ ఉన్నప్పటికి.. దాదాపు 30 నుంచి 40 అసెంబ్లి నియోజక వర్గాల్లో నాయకత్వలోటు కనిపిస్తోంది. 2018 ఎన్నికల తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంత మంది సీనియర్లు కూడా కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌, బీజేపీల్లోకి వెళ్లారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఎదురవుతోంది. ఒక్కో నియోజక వర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం మూడు, నాలుగు గ్రూప్‌లుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం, ఎవరికి వారుగా నియోజకవర్గ ఇన్‌చార్జీనని ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి సమస్యలను చెక్‌ పెట్టి.. నియోజక వర్గాల వారిగా లోపాలను గుర్తించాలని పీసీసీ నాయకత్వం నిర్ణయించింది. ప్రజల్లో పలుకుబడి ఉన్న వారికి పార్టీ కోసం పని చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చే యోచనలో ఉన్నారు.

సమన్వయంతో ముందుకెళ్లుతున్న ముఖ్య నాయకులు..

ఇటీవలనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో జరిగిన ముఖ్య నేతల సమావేశం కీలక పరిణామాలకు వేదికైంది. నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలపై కాంగ్రెస్‌ అధిష్టానం పూర్తిగా స్పష్టత ఇవ్వడం, నాయకులందరు ఐక్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాహుల్‌ సూచించారు. రాష్ట్రంలోని కార్యక్రమాల విషయంలో భిన్నాభిప్రాయాలుంటే చర్చించుకోవాలని, అవసరమైతే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌, ఇన్‌చార్జీ కార్యదర్శుల తోడ్పాటు తీసుకోవాలని రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపైన కూడ కొంత మంది సీనియర్లు హై కమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం నేతల మధ్య సమన్వయం కుదిర్చింది. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్వహించిన సమన్వయ సమావేశం తర్వాత నేతలందరు కలిసికట్టుగా ముందుకెళ్లుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర గవర్నర్‌ను తమిళిసైని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ముఖ్యనేతలందరు వెళ్లారు. విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ చేపట్టిన విద్యుత్‌ సౌధ ముట్టడిలోనూ నాయకులందరూ ఐక్యతను ప్రదర్శించారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఠాగూర్‌ రెండు రోజులు గాంధీభవన్‌లో పార్టీ సీనియర్లతో సమావేశమై పార్టీ బలోపేతానికి తీసుకునే చర్యలపై చర్చించారు. దీంతో పార్టీ నాయకులందరు కలిసికట్టుగా ముందుకెళ్లుతున్నారనే అభిప్రాయం కింది స్థాయి వరకు వెళ్లడం కూడా కీలకాంశంగానే భావవిస్తున్నారు. ఇకపై రాష్ట్ర అంశాలతో పాటు స్థానిక అంశాలను గుర్తించి వాటిపైన ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన అంశాలను జిల్లా కాంగ్రెస్‌ కమిటికి అప్పగించనున్నారు. అవసరమైతే పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు ప్రాంతాల వారిగా సభలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement