Friday, May 3, 2024

ఉద్యోగ భధ్రత, క్రమద్ధీకరణ కోరుతూ నర్సుల ఆందోళన

తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్​ చేస్తూ ఇవ్వాల తమిళనాడులో నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చెన్నైలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై, కరుణానిధి స్మారక చిహ్నం వద్ద వందలాది మంది నర్సులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా తమిళనాడు ప్రభుత్వం 2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో దాదాపు 3,290 మంది నర్సులను నియమించింది. వారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం వారి ఉద్యోగాలను పొడిగించడంతో ‘అడ్-హాక్ ప్రాతిపదికన’ నర్సులను నియమించారు. కాగా, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం దాదాపు 2472 మంది నర్సులకు త్వరలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తామని, మిగిలిన 818 మంది నర్సులకు అవసరాన్ని బట్టి పొజిటింగ్‌లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

అయితే, నిధుల కొరత కారణంగా మార్చి 31న రాష్ట్రం 818 మంది నర్సుల ఉద్యోగాలను రద్దు చేసింది. సోమవారం దాదాపు 3,290 మంది నర్సులు ఇద్దరు డిఎంకె దిగ్గజాలు అన్నాదురై, కలైంజర్ కరుణానిధి స్మారక చిహ్నాల వద్ద గుమిగూడారు. తప్పుడు వాగ్దానానికి వ్యతిరేకంగా, తాత్కాలిక ప్రాతిపదికన నియమించబడిన నర్సులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. డిఎంకె కార్యాలయం దగ్గర గుమిగూడిన కొందరు నర్సులు నిరసన ప్రారంభించకముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన నర్సులు స్మారక చిహ్నం వద్ద నిరసనను నిర్వహించవలసి వచ్చింది.

“మాకు కేవలం రూ. 14,000 చెల్లిస్తున్నారు. మేము మూడు కోవిడ్ వేవ్​లలో రోగులను జాగ్రత్తగా చూసుకున్నాం. మేము ప్రభుత్వం నుండి పెద్దగా అడగడం లేదు. కానీ మాకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ఉద్యోగ భద్రత కల్పించండి ”అని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఏంజెల్ అనే నర్సు పేర్కొంది. అవసరాన్ని బట్టి నర్సులకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement