Monday, April 29, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పై ప్రధానికి ఫిర్యాదు.. అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వినతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరిపించాలని కోరుతూ జనసమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఫిర్యాదు పత్రాన్ని ప్రధాని కార్యాలయంలో అందజేశారు. డిజైన్లు మార్చుతూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవినీతికి పాల్పడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నల్లమట్టి, ప్రాజక్ట్ కట్ట నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదు అనంతరం శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాలమూరు ప్రాజెక్టులో ఉపయోగించే నల్ల మట్టి ద్వారా రూ. 600 కోట్లకు పైగా అవినీతి జరిగిందని అన్నారు. నిజానికి నల్లమట్టిని కట్ట నిర్మాణానికి వాడకూడదని సాయిల్ రిపోర్ట్ వచ్చినప్పటికీ దాన్ని పక్కనబెట్టారని ఆయన తెలిపారు.

నల్లమట్టి కోసం నాగర్ కర్నూల్ చెరువు, కల్వకుర్తి చెరువు, పాలెం చెరువుల నుంచి మట్టి తీస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు కట్టలు తెగిపోతే నాలుగైదు మండలాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లమట్టి కోసం చెరువులు, కుంటలను ఆక్రమించుకుంటున్నారని దుయ్యబట్టారు. రూ. 35 వేల కోట్ల అంచనాతో మొదలుపెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు రూ. 50 వేల కోట్లకు చేరిందని అన్నారు. ప్రాజెక్టు మొదలుపెట్టి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల పాలమూరు రైతులు వలస పోవాల్సి వస్తుందని శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు కోసం చెరువులు, కొండలు అన్నీ తవ్విపోస్తున్నారని మండిపడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement