Thursday, May 2, 2024

రైతులు నష్టపోవద్దన్న సీఎం కేసీఆర్..​తడిసన ధాన్యం కొనాలని సర్కార్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: అకాల వర్షాలతో రైతుల ధాన్యం కళ్లముందే నీటిపాలవుతున్నది. తడిసిన ధాన్యం ఒకవైపు, వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం మరోవైపు రైతుల కళ్ల్లల్లో కడగండ్లు నింపుతోంది. పలు జిల్లాల్లో కళ్లాలు, మార్కెట్‌ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిచోట్ల రైతుల ఆక్రందనలు ఆవేదన కల్గిస్తున్న పరిస్థుతులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 65 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయినట్లుగా లెక్కలు ఉండగా, ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలద్వారా 16లక్షల టన్నులే సురక్షిత ప్రాంతాలకు చేరాయి. రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని గతంలో ఏనాడూలేని విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారలేమి కారణంగా కొనుగోలు కేంద్రాలవద్ద వేచిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెల తొలివారంనుంచీ రైతులు దాన్యం కొనుగోళ్లపై ఆశలతో నిరీక్షించారు. అయితే కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనేదిలేదని తెగేసి చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పటికప్పుడు ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగుల సమీకరణ, కాంటాలు, లేబర్‌ తదితర చర్యలను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రారంభించేలా చర్యలు తీసుకొంది.

కాగా గడిచిన పది పదిహేను రోజులుగా అకాల వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తూనే ఉన్నది. అయితే గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఈ సమయంలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసిముద్దవగా, రైతులు ఆరబెట్టిన ధాన్యం పలు జిల్లాల్లో నీటిలో కొట్టుకుపోయిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, కుమురంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, నిర్మల్‌ వదితర జిల్లాల్లో వరి ధాన్యం నీటిపాలయింది. కళ్లాల్లోని ధాన్యం అకాల వర్షాల ధాటికి తడిసి ముద్దవడంతోపాటు, పలు జిల్లాల్లో వరదలకు కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీరు పెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక జిల్లాల్లో అకాల వర్షాలు అన్నదాతను నష్టాల ఊబిలోకి నెట్టాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలు వడగండ్లు వరి ధాన్యంతోపాటు మామిడి రైతుకు తీవ్ర నష్టం కల్గించాయి. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి తదితర జిల్లాల్లో లక్షలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్ధయింది. పలు ప్రాంతాల్లో కోతకు సిద్ధంగా వరిపంట నేలపాయిందని అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రల వద్ద ఉన్న ధాన్యంతోపాటు, రైతులు ఆరబెట్టుకున్న ధాన్యం పక్కన వర్షపు నీరు చేరింది. ధాన్యం కుప్పలు టార్ఫాలిన్‌ కవర్లు లేకపోవడంతో పూర్తిగా తడిసిపోయాయి. పలు జిల్లాల్లో రైతులు తీవ్ర ఆందోళనలు చేశారు.

ఇదిలా ఉండగా పలు ప్రాంతాల్లో తేమ పేరుతో మిల్లర్లు రైతులను నిలువునా మోసం చేస్తున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి చేరుతున్నాయి. ధాన్యాన్ని 40కిలోల చొప్పున బస్తాల్లో నింపి కొనుగోలు కేంద్రలవద్ద కొనుగోలు చేయాలి. కానీ ధాన్యం తేమ కారణం చూపుతూ బస్తాకు 3నుంచి 4 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
కాగా రాష్ట్రంలో నెలకొన్న ఈ ఆందోళనకర పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న సర్కార్‌ ధాన్యం సేకరణ వేగవంతంపై మంగళవారం సమీక్షించింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ సజావుగా సాగుతుందని, రైతుల నుండి ఎలాంటి పిర్యాదులు లేవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందవద్దని, ఆరబోసి తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. సోమవారంనాటికి రాష్ట్ర వ్యాప్తంగా 6257 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. 204 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయినట్లు సమాచారం. మొత్తంగా 2 లక్షల 87వేల రైతులనుండి రూ. 3634 కోట్ల విలువైన 19 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement