Friday, May 3, 2024

Chandrayaan-3 – ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని అభినంద‌న‌లు ..

జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో పంపించిన రాకెట్ చంద్రయాన్‌-3 మాడ్యూల్ ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము , ప్రధాని మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. చంద్రయాన్‌-3 విజయవంతంగా కక్ష్యలోకి చేరడం భారత అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా అభివ‌ర్ణించారు రాష్ట్ర‌ప‌తి. ఈ విజయం కోసం నిరంతరంగా శ్రమించిన ఇస్రో బృందానికి, శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ సందేశం పంపారు. అంతరిక్ష శాస్త్ర, సాంకేతికతపై దేశం నిబద్ధతను ఈ ప్రయోగం చాటి చెబుతోంది అన్నారు.

భారత అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్‌-3 సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఈ విజ‌యం కోట్లాది మంది భారతీయుల కలల్ని, ఆశయాల్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని ప్ర‌శంసించారు. ఈ మహత్తర విజయం మన శాస్త్రవేత్తల నిర్విరామ అంకితభావానికి నిదర్శనమ‌ని. వారి స్ఫూర్తికి సెల్యూట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్రో బృందాన్ని అభినందించారు.

చంద్రయాన్‌-3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో భారత్‌ చరిత్రాత్మకమైన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించిందని, తరతరాలు గుర్తుంచుకునే అద్భుతమైన అంతరిక్ష చరిత్రను లిఖిస్తున్న ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్ చేశారు..

- Advertisement -

దేశానికి ఇది గర్వించదగ్గ రోజని, దేశ సాంకేతికాభివృద్ధికి ఇది తార్కాణమ‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. చరిత్రాత్మక ఘట్టంలో తాను కూడా భాగస్వామి కావడం ఆనందంగా ఉందంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement