Monday, April 29, 2024

పోలవరం జాప్యానికి బాబే కారణం.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం వెనుక లోకేశ్ : వైఎస్సార్సీపీ ఎంపీ భరత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పోలవరం ప్రాజెక్టు జాప్యానికి నాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని వైఎస్సార్సీపీ ఎంపీ (రాజమండ్రి) మార్గాని భరత్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తికాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మొదలుపెట్టారని, ఈ మధ్యకాలంలో వచ్చిన వరదలకు ఒత్తిడి తట్టుకోలేక దెబ్బతిన్నదని చెప్పారు. దీనిపై అధ్యయనం చేసిన నిపుణులు సమాంతరంగా మరో డయాఫ్రం వాల్ కట్టాలని సూచించారని, ఆ మేరకు ప్రభుత్వం నడుచుకుంటోందని తెలిపారు.

అదే చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే, ఏదో ఒకటి చేసి డయాఫ్రం వాల్ నిలబెట్టేవారని, కానీ భవిష్యత్తులో భారీ వరదలు సంభవిస్తే ఏం జరిగుతుందో అర్థం చేసుకోవచ్చని భరత్ అన్నారు. ఎలాంటి లీకేజి లేకుండా బలమైన పునాదులతో డయాఫ్రం వాల్ నిర్మిస్తామని అన్నారు. ఈ పెరిగిన ఖర్చుకు కారణం చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు. నాడు కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తికాకుండా డయాఫ్రం వాల్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు సైతం ఎందుకు అడ్డుచెప్పలేదో అర్థంకావడం లేదని అన్నారు. తద్వారా ఇప్పుడు పెరిగిన ఖర్చుకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ఈ తప్పిదాలకు ఆయనపై కేసులు పెట్టాలని అన్నారు.

- Advertisement -

సుపుత్రుడే స్కిల్ డెవలప్మెంట్ స్కాం సూత్రధారి!

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో చోటుచేసుకున్న అవకతవకల గురించి మాట్లాడుతూ.. షేల్ కంపెనీల ద్వారా పెట్టుబడులను దారిమళ్లించి రూ. 300 కోట్ల సొమ్ము కాజేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌కు నోటీసులివ్వడంపై స్పందిస్తూ.. గతంలో జరిగిన తప్పిదాలపై ఆయన ఎందుకు మౌనం వహించారో చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జరిగిన తప్పును బయట పెట్టకపోవడం అంటే ఆయనకూ భాగం ఉన్నట్టుగానే అనుమానించాల్సి ఉంటుందని భరత్ అన్నారు. ఏదేమైనా ఈ కుంభకోణం వెనుక సూత్రధారి చంద్రబాబు సుపుత్రుడు లోకేశే అని ఆరోపించారు. దర్యాప్తు అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చుతారని అన్నారు.

కన్నీళ్లు దాచుకోండి

విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతమవడాన్ని యావత్ ప్రపంచం చూసిందని, కానీ తెలుగుదేశం పార్టీ నేతలు చూసి ఓర్వలేక ఏడుస్తున్నారని ఎంపీ భరత్ ఆరోపించారు. దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు సదస్సుకు హాజరై ముఖ్యమంత్రితో గంటలు గంటలు గడిపారని, గతంలో ఎప్పుడైనా రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్ జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడేళ్లు నంబర్ 1గా నిలిచిన విషయాన్ని గుర్తుచేస్తూ.. పారిశ్రామిక దిగ్గజాలు తమకు అనువైన రాష్ట్రంగా భావిస్తున్నారని చెప్పారు. అంబానీ, అదానీ గ్రూపు ప్రతినిధులు సహా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చారని అన్నారు.

ఏదైనా తప్పు జరిగితే విమర్శించినా ఫరవాలేదని, కానీ మంచి జరుగుతున్నా విమర్శిస్తున్నారంటే.. దాన్ని కడుపు మంట అనక ఇంకేం అంటారని మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. లోకల్ ఫేక్ సమ్మిట్ అని లోకేష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దుష్టశక్తులన్నీ ఏకమై జగన్ ను అణచివేయాలని చూస్తే, సొంత పార్టీ పెట్టుకుని జనామోదంతో అధికారంలోకి వచ్చారని, అలాంటి వ్యక్తితో లోకేశ్ పోల్చుకోవడం ఏంటని అన్నారు. మూడు శాఖలకు మంత్రిగా పనిచేసిన లోకేశ్ ఒక్కసారైనా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారా అని ప్రశ్నించారు. టెస్లా సహా సమ్మిట్‌కు హాజరైన అంతర్జాతీయ ప్రతినిధులు ఆయన కంటికి కనిపించలేదా అన్నారు.

మాట్లాడితే కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చాం అని అటు చంద్రబాబు, ఇటు లోకేశ్ అంటున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంతోనే కియా రాష్ట్రానికి వచ్చిందని మార్గాని భరత్ అన్నారు. అంతే తప్ప ఇందులో తండ్రీకొడుకుల ఘనత ఏమీ లేదని అన్నారు. జగన్ అధికారం చేపట్టాక రాష్ట్ర వృద్ధిరేటు దేశ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని గుర్తుచేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ను బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు తదితరులు మెచ్చుకున్నారని, మంచి జరిగినప్పుడు మెచ్చుకుంటే జనం కూడా హర్షిస్తారని భరత్ అన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఏడుస్తున్నారని, వారి కన్నీళ్లు తదుపరి జరగబోయే జీ-20 సదస్సు కోసం దాచిపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.

పారిశ్రామిక ప్రగతిలోనూ సగం!

అన్ని రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ విధానమని, ఈ క్రమంలో పారిశ్రామిక రంగంలోనూ మహిళలకు తగినంత ప్రోత్సాహం ఉంటుందని ఎంపీ భరత్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని, రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. సీఎం జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ మహిళలను దృష్టిలో పెట్టుకుంటారని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement