Sunday, April 28, 2024

‘బ్లాక్ ఫంగస్‌’ కేసులపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం

దేశంలో పలు చోట్ల కరోనా వచ్చిన రోగులకు బ్లాక్ ఫంగస్ వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త మహమ్మారిని ఎదుర్కొనే ‘ఆంఫోటెరిసిన్-బీ’ డ్రగ్ లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. దేశీయంగా ఈ డ్రగ్ ఉత్పత్తి పెంచడంతో పాటు, దిగుమతులు చేసుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. బ్లాక్ ఫంగస్‌ను ఎదుర్కొనేందుకు వైద్యులు ‘ఆంఫోటెరిసిన్-బీ’ అనే మందును సూచిస్తుండటంతో మార్కెట్లో ఈ డ్రగ్ కొరత ఏర్పడకుండా ముందు నుంచీ చర్యలు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీకి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర, గుజరాత్​ తదితర రాష్ట్రాల్లో కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ సోకుతుండటం ఆందోళనకరంగా మారింది. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపు కోల్పోతున్నారు.

గత 16 రోజుల్లో సూరత్​లో 45 మందికి ఈ వ్యాధి సోకగా 9 మంది కంటి చూపు కోల్పోయారు. ఇక,​ మహారాష్ట్రలో ప్రస్తుతం 250 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50శాతం కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనుషులకు అరుదుగా సోకే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్.. కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి 2,3 రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్​లో ఇది చేరి తర్వాత కళ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement