Monday, July 15, 2024

Central Cabinet – లక్ష కోట్లతో ఆహార గిడ్డంగుల అప్ గ్రేడేషన్

ఢిల్లీ: . దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వ కోసం గిడ్డంగుల సామర్థ్యాన్ని పెంచాలని కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా సహకార రంగంలో పెద్ద ఎత్తున గోదాములను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 700 లక్షల టన్నుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ పథకం కింద రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సంబంధిత వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మీడియాకు వెల్లడించారు.


దేశంలో ప్రస్తుతం గిడ్డంగుల సామర్థ్యం 1450 లక్షల టన్నులుగా ఉందని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. రాబోయే ఐదేళ్లలో దాన్ని 2,150 లక్షల టన్నులకు పెంచాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. సహకార రంగంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో 2 వేల టన్నుల సామర్థ్యంతో గోదాములు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


ఆహార పదార్థాల వృథాను తగ్గించేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. గిడ్డంగుల సదుపాయం లేక ఆహార ధాన్యాలు వృథా అవుతున్నాయన్నారు. ఈ గోదాముల ఏర్పాటు ద్వారా నష్టానికి తమ ఉత్పత్తులను రైతులు విక్రయించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. దిగుమతులు తగ్గడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆహార భద్రతకు ఢోకా ఉండదని చెప్పారు. దేశంలో ఏటా 3100 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండుతుండగా కేవలం 47 శాతం ఉత్పత్తులను మాత్రమే నిల్వ చేయడానికి అవకాశం ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement