Friday, May 17, 2024

మండుతున్న జెట్‌ ఫ్యూయల్‌, ఆల్‌ టైం గరిష్టానికి ఏటీఎఫ్‌.. చార్జీలు పెంచే ఆలోచనలో సంస్థలు

దేశంలో ఇప్పటికే పెట్రోల్‌, డీజెల్‌ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు తాజాగా జెట్‌ ఫ్యూయెల్‌ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయెల్‌ (ఏటీఎఫ్‌) రేట్లు కూడా పెరిగిపోయాయి. శనివారం 0.20 శాతం మేర ధరలు పెంచినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా విమాన ఛార్జీలు మరింత భారంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఏటీఎఫ్‌ రేట్లు పెరగడం ఈ సంవత్సరంలో ఇది 8వ సారి. శనివారం నాటి పెంపుతో ఏటీఎఫ్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకున్నాయి. ఇది వరకు ఎప్పుడూ లేని రేటును అందుకున్నాయి. మొత్తం ఈ సంవత్సరంలోనే కిలో లీటర్‌పై అదనంగా పడిన భారం రూ.39,180.42 పైసలుగా ఉంది.

కిలో లీటర్‌పై రూ.1.13లక్షల పెంపు..

దేశ రాజధానిలో జెట్‌ ఫ్యూయెల్‌ లీటర్‌పై రూ.277.50 మేర పెరిగింది. 1,000 లీటర్ల (కిలో లీటర్‌) ఏటీఎఫ్‌ ధర రూ.1,13,202.33కు చేరుకుంది. విమానయాన సంస్థలన్నీ ఇంధనాన్ని కిలో లీటర్ల ప్రాతిపదికన కొనుగోలు చేస్తుంటాయి. ముంబైలో ఏటీఎఫ్‌ ధర కిలో లీటర్‌ మీద రూ.1,11,981.99, కోల్‌కతాలో రూ.1,17,753, చెన్నైలో రూ.1,16,933 పలుకుతోంది. విమానయాన సంస్థలు భరించే ఖర్చుల్లో 40 శాతం వాటా జెట్‌ ఫ్యూయెల్‌దే. ఈ స్థాయిలో జెట్‌ ఫ్యూయెల్‌ ధర పెరగడంతో.. విమానయాన సంస్థలు ప్రయాణ చార్జీలు పెంచే విషయంపై దృష్టి సారించాయి. ఫ్లెక్సిబుల్‌ టికెటింగ్‌ సిస్టమ్‌లో బేస్‌ ప్రైస్‌ను భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేసిక్‌ టికెట్‌ ప్రైస్‌ను పెంచడంతో డిమాండ్‌కు అనుగుణంగా వాటి రేట్లు వేల రూపాయలకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. దూర ప్రయాణాలు చేసే వారిపై ఇది అదనపు భారంగా మారుతుంది.

ఏడాదిలో 8వసారి వడ్డన..

ఏడాది కాలంలో 8వ సారి ధర పెరిగింది. ఏప్రిల్‌ 1న కిలో లీటర్‌పై 2శాతం పెంచారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ఆధారంగా ఏటీఎఫ్‌ ధరను ప్రతి నెలా 1, 16వ తేదీల్లో సవరిస్తుంటారు. 2022 జనవరి 1 నుంచి ప్రతి 15 రోజులకోసారి వీటి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏటీఎఫ్‌ ధర 50 శాతానికి పైగా పెరిగింది. విమాన నిర్వహణలో దాదాపు 40 శాతం వాటా వ్యయం ఇంధనానిదే ఉంటుంది. మార్చి 16న 18.3 శాతం (కిలో లీటర్‌కు రూ.17,135.63), ఏప్రిల్‌ 1న 2 శాతం (రూ.2,258.54) పెరిగిన నేపథ్యంలో ఏటీఎఫ్‌ ధరలో భారీ పెరుగుదల కనిపించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement