Friday, May 3, 2024

National : నెల్లూరు ఎక్స్‌ప్రెస్ రైలులో నోట్ల క‌ట్ట‌లు..4 కోట్లకు పైగా సీజ్‌…

నెల్లూరు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ మొత్తంలో 500రూపాయ‌ల నోట్ల క‌ట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. చెన్నైతాంబ‌రం రైల్వే స్టేష‌న్‌లో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్‌లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్‌లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్‌కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్‌గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి.

- Advertisement -

దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్‌కు చెందిన కిల్‌పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది.

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్‌సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement