Friday, May 17, 2024

ఊహించని వరాలతో బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో.. 16 తర్వాత రంగంలోకి అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తన పదునైన వ్యూహాలతో రాజకీయ బీష్ముడిగా పేరు తెచ్చుకున్న భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వసన్నద్దమవుతున్నారు. తన మదిలోని ఆలోచనలకు పదును పెట్టి అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. పక్షం రోజుల క్రితం వైరల్‌ పీవర్‌తో బాధపడిన ఆయన.. ప్రగతి భవన్‌లోనే విశ్రాంతి తీసుకుంటూ మేనిఫెస్టోపై మేధోమదనం నిర్వహిస్తున్నారు.

ఒంట్లో నీరసం ఉన్నప్పటికీ.. తన షెడ్యూల్‌ ప్రకారం ముందుగా ఎంచుకున్న అన్ని కార్యాక్రమాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రచిస్తున్నారు. కేసీఆర్‌ మౌనంగా ఉన్నారంటే.. దాని వెనక ఏదో ఒక వ్యూహం దాటి ఉంటుందని విపక్షాల వెన్నులో వణుకు పుట్టించేలా చేయడం ఆయనకు గతం నుంచీ అలవాటే. ఈసారి ఎన్నికల ముందూ అదే విధానాన్ని అనుగరిస్తున్నారు. అధికారం తనదేనని ఒకవైపు కాంగ్రెస్‌.. మరోవైపు భాజపా ఉవ్విళ్ళూరుతున్న నేపథ్యంలో తానంటే ఏమిటో చూపించేందుకు ఎన్నికల ప్రణాళికపై మరింత లోతుగా కసరత్తు చేస్తున్నారు.

ఊహించని వరాలతో సీఎం కేసీఆర్‌ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 16న వరంగల్‌లో ‘సింహగర్జన’ సభ వేదికగా మేనిఫెస్టోను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సభ నిర్వహణ తేదీలో ఎలాంటి మార్పు లేదని ఒకవైపు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతుండగా, మరోవైపు ప్రభుత్వ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా ఒకసారి సుడిగాలి పర్యటనలకు భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ సిద్ధమవుతున్నారు.

- Advertisement -

అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ బహిరంగ సభలకు ప్రణాళిక రచిస్తున్నారు. అప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించనున్న నేపథ్యంలో అధికారిక కార్యక్రమాలన్నింటినీ తక్షణమే పూర్తిచేసే విధంగా మంత్రులకు బాద్యతలు అప్పగించారు. మేనిఫెస్టో ప్రకటించిన నాటి నుచంఇ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రెడీ అవుతున్నారు. వరంగల్‌ జిల్లా నుంచి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతిన పూననున్నారు.

అనంతరం అనేక బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు కసరత్తు కూడా పూర్తయినట్లు వివ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ ప్రకటించే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో అద్భుతంగా, అన్నివర్గాల ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే విధంగా పలు కీలకమైన హామీలను గుప్పించబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రధానంగా అనేక సంక్షేమ పథకాలను ప్రకటించబోతున్నట్లుగా వినిపిస్తోంది. ఈ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరగడం ఖాయమని పార్టీ లీడర్లు ఇప్పటికే పేర్కొన్నారు.

మేనిఫెస్టో ప్రకటన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను విజయ శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ఉంటుందని పార్టీ వర్గాలు గట్టి ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఓటర్లపై ఆకట్టుకునేందుకు ఎలాంటి వరాలను కురిపించబోతున్నారన్న అంశంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలు కూడా కేసీఆర్‌ ప్రకటించే మేనిఫెస్టో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజకీయాల్లో అత్యంత పదునైన ప్రణాళికలు రూపొందించడంలో.. ప్రజల మూడ్‌ను పసిగట్టడంలో కేసీఆర్‌ దిట్ట అనన్ది రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచే నానుతున్న నినాదం. ఈ నేపథ్యంలో మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగా శరవేగంగా పార్టీని పరుగులు తీయిస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఆ జాబితాపై కొన్ని నియోజకవర్గాల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు కూడా ఎగిసిపడ్డాయి. అయితే దీని ప్రభావం ఎన్నికలపై పడకుండా సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో అసంతృప్తికి లోనైన నాయకులంతా ప్రస్తుతం చల్లబడ్డారు. జాబితాలో చోటు- దక్కిన అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ప్రచార వ్యూహానికి పొలిటికల్‌ మేనిఫెస్టో..

సీఎం కేసీఆర్‌ వ్యూహం, పార్టీ వర్గాల్లో తాజా పరిణామం పార్టీ అభ్యర్థుల విజయానికి మరింత దోహదం చేసే అంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, ప్రచారహోరు కోసం బలమైన పొలిటికల్‌ మేనిఫెస్టోను కూడా కేసీఆర్‌ సిద్ధం చేసినట్లు- తెలుస్తోంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్‌… ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం మరిన్ని సంక్షేమ పథకాలతో రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలు అదిరిపోయే విధంగా రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా రైతులపై మరోసారి వరాల జల్లు కురిపించబోతున్నట్లుగా పార్టీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. రైతులకు నెలవారి ఫించన్లు ఇచ్చే అంశంపై 16వ తేదీన జరుగనున్న బహిరంగ సభలో కేసీఆర్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. అలాగే ఆసరా పెంపు, నిరుద్యోగభృతిని ఎలా ఇవ్వబోతున్నామన్న అంశంపై కేసీఆర్‌ మరింత స్పష్టత ఇవ్వనున్నారు.

ప్రస్తుతం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొంత ఆలస్యమవుతున్న నేపథ్యంలో నిరుద్యోగ భృతిపై కేసీఆర్‌ గట్టిగా ఫోకస్‌ పెట్టినట్లుగా తెలుస్తోంది. అలాగే పట్టణవాసులకు ఆస్తిపన్ను చెల్లింపుల్లో భారీ ఊరట ఇచ్చే విధంగా కేసీఆర్‌ నిర్ణయాలు ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement