Friday, May 10, 2024

సందిగ్దంలో బ్రాహ్మణులు, ముస్లింలు.. యూపీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం..

(స్వరూప పొట్లపల్లి, ఆంధ్రప్రభ ఢిల్లీ బ్యూరో చీఫ్) : కులాలు, మతాలు ఓటుబ్యాంకుగా మారిన ఉత్తర్‌ప్రదేశ్ సమాజంలో ప్రస్తుతం రెండు వర్గాలు ఏ గట్టునుండాలో తేల్చుకోలేని సందిగ్దంలో ఉన్నాయి. ఇన్నాళ్లుగా నమ్ముకుంటున్న సమాజ్‌వాదీవైపు నిలవాలా లేక దేశంలోని యావత్ ముస్లిం సమాజానికే ప్రతినిధిగా, ముస్లింల గొంతు బలంగా వినిపిస్తున్న ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)’ పక్షాన నిలవాలా అన్న సందగ్దంలో ముస్లింలు ఉండగా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర అసహనంతో ఉన్న బ్రాహ్మణులు, బీజేపీకి సాంప్రదాయ ఓటర్లుగా కొనసాగాలా లేక, మరో పార్టీకి ఓటు వేయడం ద్వారా తమ అసంతృప్తిని, అసహనాన్ని చాటుకోవాలా అని మథనపడుతున్నారు. రాష్ట్ర జనాభాలో 20 శాతం వరకు ఉన్న ముస్లింలు, 10 శాతానికి పైగానే ఉన్న బ్రాహ్మణులు చాలా నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నారు. ఇన్నాళ్లూ ఈ రెండు వర్గాలు తాము నమ్ముకున్న పార్టీకి ఓటుబ్యాంకుగా నిలిచి, ఆ పార్టీలకు అనేక విజయాలను అందించాయి. కానీ ఈసారి వారిలో ఏర్పడ్డ ఆలోచన గంపగుత్తగా ఒక పార్టీ వెనకాలే పరుగులు తీసే పరిస్థితి లేకుండా చేస్తోంది.

చీలిక మంత్రమా లేక ముస్లిం స్వరమా

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ (AIMIM) పార్టీ పోటీ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. చాలాకాలం పాటు హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ గత దశాబ్దకాలంగా దేశంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్లను కైవసం చేసుకుని యావద్దేశం దృష్టిని ఆకట్టుకుంది. ఈ ఉత్సాహంతో 2015లో బిహార్లో, 2017లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 5 సీట్లు గెలుపొంది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2021లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బిహార్‌లో రెండో ప్రయత్నంలో గెలుపొందిన ఆ పార్టీ, ఇప్పుడు యూపీలోనూ రెండో ప్రయత్నంలో తమ సత్తా చాటాలని భావిస్తోంది. 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 100 సీట్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. దాదాపు 45 సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉండడంతో ఆ పార్టీ గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తమ అభ్యర్థులను గెలిపించుకోడానికి పార్టీ అధినేత ఒవైసీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై జరిగిన హత్యాయత్నం ఘటన ముస్లిం సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

అసదుద్దీన్ ఓవైసీ మతతత్వ రాజకీయాలతో పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తున్నాడనే వాదన బలంగా ప్రచారంలో ఉంది. ముస్లిం ఓట్లను చీల్చి, తద్వారా బీజేపీ వ్యతిరేక బలాన్ని తగ్గిస్తున్నాడని సెక్యులర్ పార్టీలు చేసే ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే, సెక్యులర్ పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు తప్ప వారి కోసం చేసిందేమీ లేదన్నది మజ్లిస్ పార్టీ వాదన. ముస్లిం హక్కుల కోసం పోరాడేది, ముస్లింల స్వరాన్ని బలంగా వినిపించేది మజ్లిస్ మాత్రమేనని అసదుద్దీన్ ఓవైసీ చెబుతుంటారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముస్లిం యువత పెద్ద సంఖ్యలో అసద్ ప్రచారానికి హాజరవుతోంది. ఆయన ప్రసంగాలను ఆసక్తిగా గమనిస్తూ, ఆకర్షితులవుతున్నారు. కానీ గాలిపటానికి ఓటేస్తే అంతిమంగా అంతిమంగా అది బీజేపీకే లాభం చేస్తుందనే భావన కూడా వారిలో ఉంది. దీంతో తమది అనుకునే మజ్లిస్ వెంట నిలవాలా లేక తమను ఓటుబ్యాంకుగా చేసుకున్న సమాజ్‌వాదీకే మద్ధతివ్వాలా అన్న సందిగ్ధం వారిని వేధిస్తోంది.

రాముడు సరే.. పరశురాముడితోనే సమస్య

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీని వేధిస్తున్న సమస్యల్లో రాముడు (ఠాకూర్లు) – పరశురాముడు (బ్రాహ్మణులు) ఒకటి. సీఎం యోగి ఆదిత్యనాథ్ తీరు కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన యోగిపై బ్రాహ్మణ వ్యతిరేకి అనే ముద్ర ఉంది. బీజేపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకే మద్దతిస్తూ వస్తున్న బ్రాహ్మణులు ఇప్పుడు మాత్రం బీజేపీకి ఓటు వేసే విషయంలో ఊగిసలాటలో ఉన్నారు. బీజేపీ అంటే అభిమానమున్నా.. యోగిపై ఉన్న అసహనం వారిని ఆలోచనలో పడేస్తోంది. ఈ మధ్య గంగానది సాక్షిగా బీజేపీకి ఓటు వేయబోమని కొందరు బ్రాహ్మణులు ప్రమాణం చేయడం కమలదళాన్ని కలవరపెడుతోంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో దాదాపు 12 శాతం ఉన్న బ్రాహ్మణుల సంఖ్య ఉత్తరాఖండ్‌ విడిపోయిన కొంత మేర తగ్గినా ఇప్పటికీ నిర్ణయాత్మక శక్తిగానే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఠాకూర్లతో పోల్చితే బ్రాహ్మణుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. యూపీలో ఈ రెండు అగ్రకుల సామాజికవర్గాల మధ్య చాలా కాలంగా ఆధిపత్యపోరు కొనసాగుతోంది. సీఎం యోగి తన సామాజికవర్గానికే పెద్ద పీట వేస్తూ బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వారిలో బలంగా ఏర్పడింది. సీఎం కాక ముందే యోగి బ్రాహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకిగా ఉన్నారని చెబుతుంటారు. 2002లో గోరఖ్‌పూర్ అసెంబ్లీ సీటుకు బీజేపీ నుంచి పోటీ చేసిన బ్రాహ్మణ అభ్యర్థి శివ్‌ప్రతాప్ శుక్లాపై హిందూసభ పేరుతో తన మిత్రుడు రాధామోహన్‌ అగర్వాల్‌ను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. అప్పట్నుంచే యోగిపై బ్రాహ్మణ వ్యతిరేకి అన్న ముద్ర బలంగా పడింది. పరశురామ జయంతిని సెలవుల జాబితాలోంచి తీసేయడం కూడా బ్రాహ్మణులకు కోపం తెప్పించింది. 2019లో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలోంచి బ్రాహ్మణుడైన మహేంద్రపాండేను తప్పించి కుర్మీ సామాజికవర్గానికి చెందిన స్వతంత్రదేవ్‌ సింగ్‌కు ఆ పదవి కట్టబెట్టడం కూడా బ్రాహ్మణులకు ఆగ్రహం తెప్పించింది. తమను యోగి ఉద్దేశపూర్వకంగానే అణచివేస్తున్నారన్న భావన బ్రాహ్మణుల్లో ఏర్పడింది. ఆ తర్వాత వికాస్ దూబే వంటి బ్రాహ్మణ గ్యాంగ్‌స్టర్ ఎన్‌కౌంటర్ మరింత ఆగ్రహానికి, అసహనానికి కారణమైంది. ఈ ఆగ్రహ జ్వాలలు పార్టీకి నష్టం చేసే స్థాయికి చేరుకున్నాయని కాషాయ దళపతులు గుర్తించారు.

బ్రాహ్మణులను కాపాడుకునేందుకు లఖింపురి ఖీరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఉపేక్షించింది. సంఖ్యాబలంతో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న బ్రాహ్మణులు బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుండడంతో.. కమళనాథులు బ్రాహ్మణులను కాపాడుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదే అదనుగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఏకంగా 40 బ్రాహ్మణ సంస్థల ప్రతినిధుల బృందంతో సమావేశమై బ్రాహ్మణులను తమవైపు ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. బ్రాహ్మణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని, బ్రాహ్మణ వర్గంపై యోగీ ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హామీలిచ్చారు. 108 అడుగుల పరుశురామ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. సంస్కృతం, ఆస్ట్రాలజీ అధ్యాపకుల పోస్టులలో బ్రాహ్మణులకు 90 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పారు. మరోవైపు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి సైతం గతంలో బ్రాహ్మణ-దళిత కాంబినేషన్లో అధికారాన్ని చేపట్టిన పరిస్థితులను గుర్తుచేస్తూ మరోసారి బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ బ్రాహ్మణ వర్గాన్ని ఊగిసలాటలో పడేసేలా చేశాయి. ఏ గట్టునుండాలో తేల్చుకోలేని సందిగ్దావస్థలోకి నెట్టాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement