Monday, April 29, 2024

దూసుకెళ్తున్న దేశీయ విమానయానం.. ప్రీ-కోవిడ్ రద్దీని మించి వృద్ధి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశీయ విమానయాన రంగంలో రద్దీ మరింత పుంజుకుంది. జనవరి – మార్చి మధ్యకాలంలో 51.70 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినట్టు పౌరవిమానయాన శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది (2022)లో ఇదే సమయంలో 247.23 లక్షల మంది ప్రయాణం చేయగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఏకంగా 375.04 లక్షలకు చేరుకుంది. కోవిడ్-19 ముందు పరిస్థితులతో పోల్చి చూస్తే 2019లో జనవరి-మార్చి మధ్యకాలంలో దేశీయ ప్రయాణికుల రద్దీ 354.53 లక్షలుగా ఉంది.

ఈ సంఖ్యతో పోల్చి చూస్తే ఈ ఏడాది 20.51 లక్షల మంది, అంటే 5.8% వృద్ధి నమోదైంది. అయితే 2019తో పోల్చి చూసినప్పుడు విమానయాన సంస్థలు, సేవలపై ప్రయాణికుల ఫిర్యాదులు కూడా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఫిర్యాదుల పరిష్కారం సైతం గణనీయంగా పెరిగింది. ప్రయాణికులు లేవనెత్తే సమస్యల్లో 60% విమానానికి సంబంధించినవి కాగా, బ్యాగేజి సమస్యలు ఆ తర్వాతి స్థానంలో 16.3 శాతం ఉన్నాయి.

- Advertisement -

ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్‌లో విస్తారా, ఎయిరిండియా, ఎయిర్ ఏషియా, స్టార్ ఎయిర్ సంస్థలు వృద్ధి నమోదు చేశాయి. మార్కెట్ షేర్ విషయంలో ఇండిగో, విస్తారా, ఎయిర్ ఏషియా సంస్థలు వృద్ధి నమోదు చేశాయి. అయితే ఎయిరిండియా, స్పైస్ జెట్, గోఎయిర్ సంస్థల మార్కెట్ షేర్ తగ్గింది. దేశంలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఆన్ టైమ్ పెర్‌ఫార్మెన్స్ (ఓటీపీ) విషయంలో ఇండియో, ఎయిరిండియా సంస్థలు మెరుగుపర్చుకున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement