Saturday, May 11, 2024

Delhi | ఏడాది క్రితం వరకు మేమే ప్రత్యామ్నాయం.. తెలంగాణలో వైఫల్యంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో ఏడాది క్రితం వరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)యే ప్రత్యామ్నాయం అన్నభావన ప్రజల్లో ఉందని, కానీ ప్రజల్లో ఆ నమ్మకాన్ని కొనసాగించలేకపోవడం వల్లనే ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి బాధగా ఉన్నా కేసీఆర్ శకం ముగియడం సగం సంతోషాన్ని కల్గిస్తోందని వ్యాఖ్యానించారు.

ఈ పరాజయం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పతనానికి ప్రారంభం అని అరవింద్ తెలిపారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కూడా కోల్పోయిందని, ఆ స్థితి నుంచి పార్టీని అధికారంలోకి తేవడంలో పోరాటపటిమ ప్రదర్శించిన రేవంత్‌కు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అరవింద్ అన్నారు. ఇక నుంచి తెలంగాణలో హుందాతనంతో కూడిన రాజకీయాలు ఉంటాయని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే వ్యక్తిగత దూషణ, ఇళ్లపైకి రాళ్లతో దాడులు వంటి సంస్కృతికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నానని ఆయన తెలిపారు.

నేతలు ఉపయోగించే భాష కూడా మారుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అంటూ చేసిన ఆరోపణలను ప్రజలు నిజమేనని భావించారని, ఆ క్రమంలో కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్ వైపు మొగ్గచూపారని తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు సైతం ఈ పరిస్థితికి దోహదం చేసిందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా తెలంగాణలో బీఆర్ఎస్ శకం ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ – బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచి కొన్ని స్థానాల్లో గెలుపొందిందని ఆరోపించారు.

- Advertisement -

తన పొరుగున ఉన్న బాల్కొండలో ఒక్క రోజులో రూ. 34 కోట్లు పంచారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అసెంబ్లీ ఎన్నికలుగా రికార్డుకెక్కుతాయని అన్నారు. తాను కోరుట్లలో డబ్బు పంచకుండా ఎన్నికల్లో పోటీ చేసి ఒక ప్రయోగం చేశానని, ఆ ప్రయత్నంలో ఓడిపోయినా సరే.. అన్ని ఓట్లు ఇవ్వడం అంటే కోరుట్ల ప్రజల విజయంగానే భావిస్తున్నానని అన్నారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మేల్యేలు జారుకుంటారని, ప్రజల్లో ఆ పార్టీపై అభిమానం పోయిందని తెలిపారు. మనిషికి సహజ మరణం ఉన్నట్టే ఆ పార్టీ పతనమైపోతుందని అరవింద్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతగా కూడా రావొద్దని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement