Sunday, March 3, 2024

అరవింద్ ఇంటిపై దాడి.. ఖండించిన బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బతికించిందే నాటి కాంగ్రెస్ నేతలు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), వెంకట స్వామి అని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఢిల్లీలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్ సతీమణి ఒక్కరే ఇంట్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ గూండాలు దాడికి పాల్పడడం దారుణమని ఆయన పేర్కొన్నారు. 2004లో ఉమ్మడి రాష్ట్రం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్, ఢిల్లీలో ఉన్న వెంకటస్వామి ఇద్దరూ కలిసి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వ్యతిరేకించారని, అయినప్పటికీ ఉద్యమంలో డీ. శ్రీనివాస్, వెంకట స్వామి కీలక పాత్ర పోషించారని తెలిపారు. అలాంటి కుటుంబంపై దాడికి పాల్పడినవారు తెలంగాణ వ్యతిరేకులేనని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల సహాయంతోనే టీఆర్ఎస్ గూండాలు అరవింద్ ఇంటిపై దాడికి తెగించారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు టీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు సరైన గుణపాఠం చెబుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement