Sunday, April 28, 2024

Delhi | ఈనెల 25న రాష్ట్రానికి జేపీ నడ్డా.. వెల్లడంచిన బీజేపీ నేత తరుణ్ చుగ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న తెలంగాణ రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. వరుసపెట్టి పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా తెలంగాణ పర్యటన చేపట్టనున్నట్టు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ప్రకటించారు. గురువారం ఓ వీడియో ప్రకటన విడుదల చేసిన తరుణ్ చుగ్, తెలంగాణలో నాగర్‌కర్నూల్‌లో ఓ భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారని వెల్లడించారు. గుజరాత్‌పై విరుచుకుపడ్డ ‘బిపర్‌జోయ్’ తుఫాను కారణంగా గురువారం చేపట్టాల్సిన అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

త్వరలోనే అమిత్ షా పర్యటన ఖరారవుతుందని తరుణ్ చుగ్ చెప్పారు. వాయిదాపడ్డ పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర నాయకత్వం మార్పు గురించి జరుగుతున్న ప్రచారంపై ఆయన మరోసారి స్పష్టతనిచ్చారు. బండి సంజయ్ ని  మార్చేది లేదని తేల్చి చెప్పారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల రణరంగంలో పాల్గొంటారని చుగ్ వెల్లడించారు. పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి రహస్య ఒప్పందాలు ఉన్నాయనడం అభూత కల్పన అన్నారు.

- Advertisement -

ఈ నెల 23న బిహార్ రాజధాని పాట్నాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో విపక్షాలు తలపెట్టిన సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు కేసీఆర్ కూడా హాజరవుతున్నారని తరుణ్ చుగ్ అన్నారు. దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పైస్థాయిలో అందరూ కలిసే పనిచేస్తారని, రాష్ట్రానికి వచ్చేసరికి విమర్శలు చేసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీ-టీమ్‌లా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని చుగ్ విమర్శించారు. కొన్ని సందర్భాల్లో బీ-టీమ్‌లా, కొన్నిసార్లు సీ-టీమ్‌లా కూడా కాంగ్రెస్ పార్టీయే పోటీ పడుతోందని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement