Friday, May 17, 2024

బీజేపీ దేశాన్ని అమ్మాలని చూస్తోంది, రాష్ట్రాలపై పెత్తనానికి ప్రయత్నిస్తోంది.. కేంద్రంపై మండిపడ్డ టీఆర్‌ఎస్ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దళిత వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ దేశాన్ని అమ్మేయాలని చూస్తోందని టీఆర్‌ఎస్ ఎంపీలు ధ్వజమెత్తారు. బుధవారం న్యూఢిల్లీలోని తెలంగాణా భవన్‌లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడే హక్కు ఉందన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. తెలంగాణకి ఏం చేయాలనుకుంటున్నారో 2014లోనే చెప్పి చేసి చూపించిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. కేంద్రం ఇప్పుడు చెప్తున్నవి కేసీఆర్ ముందుగానే రాష్ట్రంలో చేసి చూపించారన్నారు. ఐదు ట్రిలియన్ ఎకానమీ తీసుకువస్తామని కేంద్రం ఐదేళ్ల క్రితమే ప్రకటించినా దేశం ఇంకా అక్కడే ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 375 లక్షల కోట్ల బడ్జెట్ పెడితేనే 5 ట్రిలియన్ ఎకానమీ సాధించినట్టని స్పష్టం చేశారు. తెలంగాణ బడ్జెట్ రెట్టింపు అయిందని, టార్గెట్ ఓరియెంటెడ్ అప్రోచ్ అంటే అదీ అని రంజిత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు ట్రిలియన్ ఎకానమీలో రాష్ట్రాల వాటా తెలంగాణ ఎప్పుడో సాధించిందని, కేంద్రంలోనే ఎలాంటి పురోగతీ లేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లకు తెలంగాణ జీడీపీ రెట్టింపైందన్న ఆయన కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగం గురించి రెండు నిమిషాలు మాట్లాడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. 2016లో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపని ప్రకటించిన నేతలు ఎందుకు సాధించలేకపోయారో చెప్పనే లేదన్నారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ముందే చెప్పమని కోరుతున్నా కేంద్రం స్పందించట్లేదని ఆయన వాపోయారు. పీఎం కిసాన్ నిధుల కన్నా కేసీఆర్ రైతు బంధు నిధులే ఎక్కువని వెల్లడించారు. ధాన్యాల సేకరణ పాలసీ రూపొందించాలి… ఎంఎస్పీకి నిధులు పెట్టామంటే సరిపోదని రంజిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు నిధులిస్తున్నారే గానీ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణకు మాత్రం సరైన కేటాయింపులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి రేటులో దేశంలో ముందున్న దేశంలో ముందున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని రంజిత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

అనంతరం ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ…

దేశంలో 40 కోట్లున్న ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో నిధులు లేవని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు గురించి కేసీఆర్‌పై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ ప్రాంగణం వెనుక అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ఆరోగ్య రంగానికి నిధులు కేటాయించలేని స్థితిలో బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు. దళితులు, బీసీలు, మైనారిటీలు, రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తోందని వెంకటేష్ నేత ఆరోపించారు. రాష్ట్రాలపై పెత్తనం చేయాలనీ చూస్తోందని విమర్శించారు. వ్యవసాయం, డ్యాం సేఫ్టీ, ఎన్ఐఏను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పుకొచ్చారు. దేశ రాజ్యాంగాన్ని బీజేపీ తన రాజ్యాంగంగా మార్చుకుందని ఆయన ధ్వజమెత్తారు. కార్పొరేట్లతో కలిసి దేశ్‌క వినాష్‌కు బీజేపీ పాల్పడుతోందని ఎంపీ వెంకటేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలో కాదు ఢిల్లీలో ప్రధాని కార్యాలయం ముందు నిరసనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement