Monday, April 29, 2024

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి పార్టీలకతీతంగా ఎన్టీఆర్ అందరివాడు.. పార్లమెంట్‌లో విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ రఘురామకృష్ణరాజు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : శతజయంతి ఉత్సవాలు పూర్తయ్యే సంవత్సరంలోగా ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేందుకు కృషి చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్‌ను పెను నినాదంగా మార్చి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేలా చేస్తామని ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. శత జయంతి సందర్భంగా శనివారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి రఘురామకృష్ణరాజు నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఎంపీగా ఉండి ఎన్టీఆర్‌కు నివాళులర్పించడమేంటని కొందరు తనను ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అందరివాడే గానీ కొందరి వాడు కాదన్న రఘురామ, ఆయన ఆశయ సాధన కేవలం జగన్మోహన్ రెడ్డితో మాత్రమే సాధ్యమని విజయవాడలో తమ పార్టీ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టారని తెలిపారు. రామారావు పార్టీలకు అతీతుడనే విషయం ఈ ఒక్క ఘటనతో స్పష్టమవుతుందని వివరించారు. మహానాయకుడు ఎన్టీఆర్ నిద్రాహారాలు మాని కష్టపడి సినిమా రంగంలో పైకి ఎదిగారని, తన చిత్రాల ద్వారా సామాజిక చైతన్యం కలిగించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ 60వ ఏట రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు రాష్ట్ర చరిత్రలో ఆద్యుడైన ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి కొత్త ఒరవడిని సృష్టించారని, బీసీలకు రిజర్వేషన్ మాటల్లో కాకుండా చేతల్లో చూపించి చిరస్మరణీయుడిగా నిలిచారని రఘురామకృష్ణరాజు అన్నారు. రాయలసీమ కరవు నివారణకు గాలేరు-నగరి, హంద్రీ నివా ప్రాజెక్టులను ప్రారంభించారని, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలనే ప్రతిపాదన చేశారని తెలిపారు. మద్రాసీలమంటూ చిన్నచూపుకు గురవుతున్న వారికి తెలుగు వారిగా గుర్తింపునిచ్చిన ఎన్టీ రామారావుకు ఎన్ని అవార్డులిచ్చానా రుణం తీర్చుకోలేమన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు.

సకల శాఖలూ ఆయన చేతుల్లోనే..

జయహో జగనన్న ట్యాగ్‌లైన్‌తో చేపట్టిన బస్సుయాత్ర బలహీనమై ఖాళీ కుర్చీల సభగా మిగిలిపోయిందని రఘురామ ఎద్దేవా చేశారు. మహానాడులో లోపలకు వెళ్లడానికి తోపులాట జరిగితే బస్సు యాత్ర సభకు వచ్చిన జనం బయటకు పారిపోవడానికి తోపులాట జరిగిందని విమర్శించారు. మనిషికి 500 రూపాయలిచ్చినా మూడు బస్సులకు సరిపడా జనం కూడా రాలేదన్నారు. బతిమాలినా, భయపెట్టినా పది బస్సుల్లో మూడు బస్సుల నిండా కూడా జనం రాలేదని విమర్శించారు. బీసీ , ఎస్సీ సామాజిక వర్గాల నేతలకు అధికారం లేని పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గ ప్రజలు ఓట్లు వెయ్యమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. పేరుకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి సకల శాఖలను సజ్జల రామకృష్ణారెడ్డే నిర్వహిస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement