Wednesday, April 17, 2024

Big Story | చారిత్రాత్మక చెరువుల సుందరీకరణ.. 119 నియోజకవర్గాల్లో పూర్తి కావస్తున్న ట్యాంక్‌బండ్ ల నిర్మాణాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న తెలంగాణలోని గుప్పెడు మన్నులో గంపెడు చరిత్ర దాగిఉంది. ఈచరిత్రను పదిలపర్చుకున్న జలాశయాలను తీర్చి దిద్ది పర్యాటక ప్రాంతాలుగా మలచడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసి పనుల్లో వేగం పెంచింది. 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి ఒకచెరువును ట్యాంకుబండ్‌ లు గా తీర్చి దిద్దుతున్నారు. ఇప్పటివరకు సుమారు 90 శాతం పనులు పూర్తి అయినట్లు సంబంధింత శాఖల అధికారులు అంచనావేస్తున్నారు. ఇబ్రహీం కులీకుతుబ షాహీ నిర్మించిన హుస్సేన్‌ సాగర్‌ పర్యాటకప్రాంతాంగా ప్రసిద్ధి చెందినట్లు నియోజకవర్గాల్లో ట్యాంక్‌ బండ్‌ లను తీర్చిదిద్దుతున్నారు. నీటిపారుదల శాఖ గుర్తించిన చెరువుల్లో కాకతీయులు, చాళుక్యులు, కుతుబ్‌ షాహీలు,నిజాంలు నిర్మించిన అనేక చెరువులున్నాయి.

చాళుక్యరాజలు ఏలిన గడ్డ, సాహిత్యానికి, సంస్కృతికి, కళలు, చేనేత పరిశ్రమ విరాజిల్లిన ప్రాంతమది. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి విక్టోరియా రాణికి బహుమతి ఇచ్చిన చేనేతకళాకారుల పుట్టిన ఇల్లు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌,రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పాలిస్తున్న నియోజకవర్గం అదే సిరిసిల్ల. అయితే ఈ నియోజకవర్గంలో గతచరిత్ర ను తలపిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నప్పటికీ చారిత్రకు ప్రాధాన్యత ఇచ్చి చాళుక్యులు నిర్మించిన సిరిసిల్ల చెరువును సుందరంగా తీర్చి దిద్దే పనిలో లో మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిని ముందుకు తీసుకువచ్చారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ కు లేని సౌకర్యాలు అక్కడ సమకూర్చడంతో పర్యాటకులను అమితంగా సిరిసిల్ల ట్యాంక్‌ బండ్‌ ఆకట్టుకుంటుంది.

పూర్వ కరీంనగర్‌ జిల్లాలో భాగమై 11 అక్టోబర్‌ 2016లో సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించింది. కేటీఆర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ జిల్లాశరవేగంగా అభివృద్ధి సాధిస్తుంది. అధునాతనహంగులతో సిరిసిల్ల లో ఏర్పాటు చేసిన మినీట్యాంక్‌ బండ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రూ. 13.25 కోట్ల వ్యయంతో 72 కెరాల కొత్త చెరువును మినీట్యాంక్‌ బండ్‌ గా తీర్చి దిద్దారు. 1.8 కిలోమీటర్ల మేరకు బండ్‌ నిర్మాణం చేపట్టారు. బండ్‌ అభివృద్ధిలో ప్లోరింగ్‌, లైటింగ్‌, రెయిలింగ్‌, యోగా పెవిలియన్‌ట్రిన్‌ ప్లాట్‌ ఫాం, టన్నెల్‌, కూర్చోవడానికి షెడ్లు, ప్లాంటేషన్‌ ర్పాేటుచేశారు.క్రీడాకారుల సౌకర్యంకోసం జిల్లా కేంద్రాల్లో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు.శివారు ప్రాంతంలోని 4.30 ఎకరాలస్థలాన్ని బండ్‌ కు అనుసంధానం చేసి క్రీడాకారులను ఆకర్షించే విధంగా రూపొందించారు.

- Advertisement -

ఫౌంటేన్‌ వద్ద అందమైన శిల్పాలు, స్టేడియంలో టెబుల్‌ టెన్నీస్‌,ఫుడ్బాల్‌ తదితరక్రీడలకు సౌకర్యాలు మెరుగుపర్చారు. రాష్ట్ర పర్యటనకు వచ్చే పర్యాటకులు సిరిసిల్ల ను సందర్శించడం అలవాటుగా మారింది. అలాగే సిరిసిల్ల మిడ్‌ మానేరును పర్యాటక ప్రాంతాలుగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలను సిద్ధంచేశారు.అలాగే రాష్ట్రంలోని వేలాదిచెరువుల్లో ఎంపిక చేసిన 119 చెరువులను తీర్చి దిద్దుతున్నారు. సిద్ధిపేట కోమటి చెరువు,ఖమ్మం లకారం చెరువు తో పాటుగా అనేక చరిత్ర నేపథ్యం ఉన్న చెరువుల సుందరీకరణలో స్థానిక ప్రజాప్రతినిధులు నీటి పారుదల శాఖ తో కలిసి పనుల్లో నిమగ్నం కావడంతో రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నీ పర్యాటక ప్రాంతాలుగా అలరాలే అవకాశాలు అధికంగా ఉన్నయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement