Saturday, June 22, 2024

Delhi | ఖర్చు పెట్టే సామర్థ్యం బీసీలకూ ఉంది.. జనాభాకు తగ్గట్టే ఎక్కువ సీట్లు ఇవ్వాలి: వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల్లో ఖర్చు పెట్టే సామర్థ్యం బీసీలకు కూడా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంత రావు (వీహెచ్) అన్నారు. బుధవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ‘కేఎం ఖాన్ స్మారకోపన్యాసం’లో పాల్గొన్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని, అందుకే టికెట్లు కావాలంటూ వివిధ వర్గాలు అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. అగ్రవర్ణాలు సైతం కుల సంఘాల పేరుతో టికెట్లు డిమాండ్ చేస్తున్నాయని, టికెట్లు అడగడంలో తప్పు లేదని, కాకపోతే జన సంఖ్య ఎక్కువ ఉన్న బీసీలకు తగినన్ని సీట్లు ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదే డిమాండ్‌పై అధిష్టానం పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా సరే.. తమ డిమాండ్లను అమలు చేస్తారన్న నమ్మకం అధిష్టానంపై ఉందని వీహెచ్ తెలిపారు. ప్రయత్నలోపం లేకుండా టికెట్లలో బీసీలకు వాటా కోసం తాను అన్ని వేదికలను ఉపయోగించుకుని అడుగుతూనే ఉంటానన్నారు. బీసీలకు టికెట్లు ఇచ్చాం అని చెప్పుకోడానికి హైదరాబాద్ పాతబస్తీలో ఓడిపోయే సీట్లు ఇచ్చి లెక్కలోకి తీసుకుంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునే స్తోమత, సామర్థ్యం బీసీ నేతలకు కూడా ఉందని, ప్రజాదరణ కలిగిన నేతలు కూడా బీసీల్లో ఉన్నారని వీహెచ్ వెల్లడించారు.

- Advertisement -

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలు ఉన్నందున వారికి తగినంత ప్రాతినిథ్యం లభిస్తోందని, అయినప్పటికీ జనరల్ సీట్లలోనూ తమకు టికెట్లు కావాలని ఈ రెండు వర్గాలు కోరుతున్నాయని తెలిపారు. ఎక్కువ జనాభా కలిగిన బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తే ఎక్కువ ఓట్లు దక్కుతాయని వీహెచ్ సూత్రీకరించారు.

తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) తీర్మానం ప్రకారం కనీసం 34 సీట్లైనా ఇవ్వాలని కోరుతున్నామని వీహెచ్ అన్నారు. ఐఐఎం, ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో బీసీలకు అవకాశాలు కల్పించింది సోనియా గాంధీయేనని, బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం పనిచేసేది కాంగ్రెస్ ఒక్కటేనని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు తగినన్ని సీట్లు దక్కేలా అధిష్టానం వ్యవహరిస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు టికెట్లు అడుగుతున్న మాట కూడా నిజమేనని, కానీ అభ్యర్థుల పేర్లను ఇంకా ప్రకటించలేదు కాబట్టి, అధిష్టానం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని తాను భావిస్తున్నానని తెలిపారు.

ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను దృష్టిలో పెట్టుకునే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు. గురువారం రేవంత్ రెడ్డిని కలిసి బీసీల డిమాండ్లను ఆయనకు చెబుతామని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షులు పార్టీలో సీనియర్లను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విజయ భాస్కర రెడ్డి, జనార్థన్ రెడ్డి వంటి సీనియర్లందరినీ సంప్రదించేవాడినని గుర్తుచేశారు. బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకపోతే అప్పుడు తమ కార్యాచరణ ఏంటో చెబుతామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement