Monday, April 29, 2024

బెంగ‌ళూరు వ‌ర్సెస్ రాజ‌స్థాన్.. ఫైన‌ల్ కు చేరేది ఎవ‌రు..?

ఐపీఎల్‌-2022 ఫైనల్‌కు గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటికే చేరుకోగా, మరో జట్టు ఎవరనేది ఇవ్వాల‌ తేలనుంది. బెంగళూరు, రాజస్థాన్‌ జట్ల మధ్య ఈ రోజు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా కీలక మ్యాచ్‌ జరుగనుంది. తొలి క్వాలిఫ్లయర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కనీసం ఈసారైనా బెంగళూరుతో జరిగే రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో ఉంది. బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌పై బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ అద్భుత విజయం సాధించి దూకుడు మీద ఉంది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ రజత్‌ పాటీదార్‌ 112 పరుగులతో అజేయంగా నిలిచి, ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు జట్టు పరంగా చూస్తే… విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, రజత్‌ పాటీ దార్‌, మ్యాక్స్‌వెల్‌ అద్భుతమైన బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. బౌలింగ్‌ పరంగానూ హర్షల్‌ పటేల్‌, హసరంగ, సిరాజ్‌, హాజల్‌ వుడ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ సీజన్‌లో రాజస్థాన్‌ కంటే బెంగళూరు జట్టు మెరుగైన ఆట తీరు కనబరిచింది.

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు పరంగా చూస్తే… రవిచంద్రన్‌ అశ్విన్‌ లాంటి ఆల్‌ రౌండర్లు ఉన్నారు. షిమ్రోన్‌ హెట్‌మేర్‌ జట్టులోకి రావడం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశం. అయితే వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. హెెట్‌మేర్‌ రాకతో మిడిల్ ఆర్డర్‌ మరింత బలపడింది. మొత్తం మీద రాజస్థాన్‌ జట్టు స్థిరమైన జట్టుగా కొనసాగుతున్నది. మిడిల్‌ ఆర్డర్‌లో సంజు శాంసన్‌, దేవదత్‌ పడిక్కల్‌ వంటి హిట్టర్లు ఉన్నారు. రియాన్‌ పరాగ్‌, హెట్‌మేర్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లు రాజస్థాన్‌లో ఉన్నారు. డెత్‌ ఓవర్స్‌లో ఎంతో బాగా రాణిస్తారు. బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ క్రిష్ణలు కొత్త బాల్‌ను బాగా ఉపయోగించుకోవాలి. ఇది ఈ జట్టులో కొరవడింది. చాహల్‌ 26 వికెట్లతో బెస్ట్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. మిడిల్‌ ఓవర్స్‌లో అశ్విన్‌ పరుగులు కట్టడి చేయగలడు.

ఇరు జట్ల ఆటతీరును పరిశీలిస్తే… అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అయితే ఒత్తిడిలో రాజస్థాన్‌ జట్టు రాణించడం కష్టమేనని మొన్నటి తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో తేటతెల్లమైంది. ఈ విషయంలో బెంగళూరు జట్టు కొంత మెరుగ్గానే ఉంది. ఒత్తిడిలో ఎలా నెగ్గుకురావాలన్న అంశంలో బుధవారంనాడు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను పరిశీలిస్తే అర్థమవుతుంది. 18వ ఓవర్‌లో హర్షల్‌ పటేల్‌ రెండు వైడ్‌లు వేసినా, మొత్తం రెండు పరుగులతోనే ఓవర్‌ను ముగించడం ప్రశంసనీయదగ్గ విషయం. ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. నేటి రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాణిస్తుందా? బెంగళూరు గెలుస్తుందా అన్నది వేచిచూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement