Saturday, March 2, 2024

Delhi | బండి సంజయ్‌కి పదోన్నతి.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ నాయకత్వంలో కొన్ని మార్పులు, చేర్పులు చేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పించిన బండి సంజయ్‌కు పదోన్నతినిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. సంస్థాగతంగా ఈ మధ్య జరిగిన మార్పులు, చేర్పుల నేపథ్యంలో పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా పార్టీ నేషనల్ ఆఫీస్ బేరర్ల జాబితాను పునర్వ్యవస్థీకరించారు. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుంటూ నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన కొన్ని ముస్లిం వర్గాలతో పాటు గిరిజన-ఆదివాసీలకు కూడా కొత్త జాబితాలో చోటు కల్పించింది. కొన్ని మార్పులు మినహా జాబితాలో చాలావరకు పాతవాళ్లే కొనసాగినప్పటికీ, కొత్తగా జాబితాలో చోటు దక్కించుకున్న ప్రతి ఒక్కరి నేపథ్యం ప్రత్యేకమైనది.

తెలంగాణలో పార్టీని హైదరాబాద్ దాటి విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన బండి సంజయ్‌తో పాటు మరికొందరికి జాతీయ నాయకత్వంలో చోటు లభించింది. అలా చోటు లభించినవారిలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్, ప్రస్తుతం యూపీలో బీజేపీ ఎమ్మెల్సీగా ఉన్న తారిఖ్ మన్సూర్‌ కూడా ఉన్నారు. ముస్లింలలో వెనుకబడిన పస్మంద సామాజికవర్గానికి చెందిన తారిఖ్ మన్సూర్‌‌కు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఆ వర్గం నేతల ఆదరణ పొందుతున్న కమలదళం, తారిఖ్‌ను ఉపాధ్యక్షుడిగా తీసుకోవడంతో పాటు మైనారిటీ వర్గాలకే చెందిన కేరళ నేత అబ్దుల్లా కుట్టికి సైతం ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా ఆ వర్గాల్లో బీజేపీ బలమైన సందేశాన్ని పంపింది.

ముఖ్యంగా ముస్లింలలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. త్వరలో అసెంబ్లీ జరుపుకోనున్న చత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ సభ్యుడైన సరోజ్ పాండేతో పాటు గిరిజన ఆదివాసీ నేత లతా ఉసేండిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. అలాగే ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంత్ బాజ్‌పాయిని కూడా ఉపాధ్యక్షులుగా పార్టీ ఎంపిక చేసింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, మాజీ రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీకి నాయకత్వం జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకం ద్వారా కేరళతో పాటు దేశవ్యాప్తంగా క్రైస్తవ వర్గాలకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆంటోనీతో పాటు రాజ్యసభ సభ్యులైన సురేంద్ర సింగ్ నాగర్, కామాఖ్య ప్రసాద్ తాసాలను కూడా జాతీయ కార్యదర్శులుగా బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ యూపీలో ప్రాబల్యం ఉన్న గుజ్జర్ సామాజికవర్గానికి నాగర్ ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో తేయాకు సాగులో ఉన్న గిరిజన జాతులకు ప్రతినిథిగా తాసా ఉన్నారు. మార్పులు, చేర్పుల్లో ఎలాంటి మార్పునకు లోనవకుండా ఉపాధ్యక్షులుగా కొనసాగినవారిలో మాజీ ముఖ్యమంత్రులు రమణ్ సింగ్ (చత్తీస్‌గఢ్), వసుంధర రాజే (రాజస్థాన్), రఘుబర్ దాస్ (జార్ఖండ్)తో పాటు తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ ఉన్నారు. మొత్తంగా ఉపాధ్యక్షుల జాబితాలో నలుగురు మహిళలకు చోటు దక్కింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కొనసాగినవారిలో అరుణ్ సింగ్, కైలాస్ విజయవర్గీయ, దుష్యంత్ కుమార్ గౌతమ్, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, వినోద్ తావ్డే ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందున దగ్గుబాటి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితా నుంచి తొలగించారు. ఆమెతో పాటు సీటీ రవి, దిలీప్ సైకియాను కూడా అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితా నుంచి తొలగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్ష బాధ్యతల నుంచి కేంద్ర మాజీ మంత్రి, బిహార్ నేత రాధా మోహన్ సింగ్‌ను కూడా తొలగించింది. జాతీయ కార్యదర్శుల జాబితాలో వై. సత్యకుమార్ చోటు కొనసాగగా, చోటు కోల్పోయినవారిలో వినోద్ సోంకర్, హరీశ్ ద్వివేది, సునీల్ దేవధర్ ఉన్నారు. మొత్తంగా పునర్వ్యవస్థీకరించిన తర్వాత జాబితాలో 13 మంది ఉపాధ్యక్షులు, సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా మొత్తం 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది జాతీయ కార్యదర్శులు ఉన్నారు.

ఏపీ కొత్త ఇంచార్జిగా బండి?
తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంతో వచ్చిన ఊహాగానాలు, వదంతులకు చెక్ పెడుతూ జాతీయ నాయకత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. గతంలో తెలుగు రాష్ట్రాల నుంచి మురళీధర్ రావు, రామ్ మాధవ్, తాజాగా డి. పురందేశ్వరి ఈ బాధ్యతల్లో ఉన్నారు. తొలుత త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బండి సంజయ్‌కు చోటు కల్పిస్తారన్న ప్రచారం జరిగింది. జాతీయ నాయకత్వం మాత్రం బండి సేవలను ప్రభుత్వం కంటే పార్టీకే వినియోగించుకోడానికి మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. అందుకే ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకోగా.. త్వరలోనే ఏదో ఒక రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు కూడా అప్పగించనుంది.

హిందీపై అంతగా పట్టులేని బండి సంజయ్‌ను దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితమైన పార్టీని తెలంగాణలో చాలా జిల్లాల్లో, గ్రామస్థాయిలోకి విస్తరించడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పోరాట పటిమ, ఛాందసవాదులకు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరించే తీరు పార్టీలో కిందిస్థాయి కేడర్‌లో విశేష అభిమానాన్ని సంపాదించిపెట్టింది. ఇదే ఊపుతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎదుర్కోవాలని భావించినప్పటికీ.. కొన్ని సమీకరణాల కారణంగా అనూహ్యంగా బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించింది. తొలగించినంత మాత్రాన ఆయన ప్రాధాన్యతను అధిష్టానం ఏమాత్రం తగ్గించలేదని చెప్పడం కోసం ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ మాదిరిగా పార్టీని ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించాలని భావిస్తున్న కమలనాథులు, బండి సంజయ్ సేవలను ఆంధ్రప్రదేశ్‌లో వినియోగించుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా కేంద్ర మంత్రి వి. మురళీధరన్ ఉండగా, సహ-ఇంచార్జిగా సునీల్ దేవధర్ ఉన్నారు. వీరిలో ఇప్పుడు సునీల్ దేవధర్‌ను జాతీయ కార్యదర్శి బాధ్యతల నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇంచార్జిల్లో మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. పైగా మురళీధరన్‌ దృష్టి తన సొంత రాష్ట్రం కేరళలో పార్టీ విస్తరణపై పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బండి సంజయ్‌కు ఏపీ వ్యవహారాల బాధ్యతలు అప్పగిస్తే.. సామాజిక సమీకరణాల పరంగా చూసినా సరే రెండు ప్రధాన సామాజికవర్గాలకు రాష్ట్ర అధ్యక్ష, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి బాధ్యతలను అప్పగించినట్టు ఉంటుందని పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement