Monday, April 29, 2024

Delhi | బాబు ఇండియా కూటమిలోకి రావాలి.. ఆంధ్రాలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయాలి : సీపీఐ నారాయణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’లో చేరాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్టులతో కలిసి పోటీచేస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌ను బ్రేక్ చేయవచ్చని వ్యాఖ్యానించారు. మణిపూర్ పర్యటన అనంతరం సీపీఐ నేతల బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నారాయణ.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో ఉన్నది కూడా డబుల్ ఇంజిన్ సర్కారే అని సూత్రీకరించారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జతకట్టాయని ఆరోపించారు. ప్రధాని మోడీ – సీఎం కేసీఆర్ మొన్నటి వరకు ఉప్పు – నిప్పులా వ్యవహరించారని, ఆ సమయంలో గవర్నర్‌ను అటెండర్‌లా చూశారని నారాయణ అన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి వచ్చినవేళ సంప్రదాయాన్ని కాదని ఆహ్వానం పలకడం కోసం వెళ్లలేదని గుర్తుచేశారు. ఢిల్లీ నుంచి మొట్టికాయలు పడగానే ఇప్పుడు గవర్నర్‌కు బానిసలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. జగన్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలవగానే జైలుకెళ్లాల్సిన అవినాశ్ రెడ్డి బయటపడ్డారని అన్నారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ పచ్చి అవకాశవాదులని, కవితపై కేసు విషయంలోనే కేసీఆర్ బీజేపీకి తలొగ్గారని అన్నారు. బీజేపీ డైరెక్షన్లోనే విపక్షాల సమావేశాలకు హాజరుకాకుండా ఎంఐఎంతో కలిసి మూడో కూటమి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

తెలంగాణలో బండి సంజయ్ మార్పుతో బీజేపీ కథ ముగిసిపోయిందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని అన్నారు. ప్రస్తుతం పొత్తుల దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కలిసి పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్ ఓటమి తథ్యమని వ్యాఖ్యానించారు. ఓట్ల ప్రాతిపదికన కాకుండా ఒకరికొకరు అవసరం ప్రాతిపదికన పొత్తులపై చర్చలు జరగాలని అన్నారు.

మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసమే తాము బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చామని, అందుకు తామేమీ చింతించడం లేదని అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల విషయంలో కమ్యూనిస్టులు కాస్త ముందుగానే తేరుకోవాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమల కొండపై మద్యం అమ్మకాలు నిషేధించారు కానీ మద్యం వ్యాపారి శరత్ చంద్రారెడ్డికి పాలకమండలిలో చోటు ఎలా కల్పిస్తారని నారాయణ ప్రశ్నించారు.

గ్యాస్ ధరల తగ్గింపుపై స్పందిస్తూ.. ఎన్నికల కోసమే గ్యాస్ ధరలు తగ్గించారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే సిలిండర్ ధర రూ. 1,200కు పెరిగిన గ్యాస్ ధరను 2014లో ఉన్న ధరకంటే తక్కువకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల తగ్గింపు అపదమొక్కుల ప్రయత్నమేనని ఎద్దేవా చేశారు.

మోడీ గ్రాఫ్ విదేశాల్లో పెరుగుతోంది

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంతో పడిపోతుందని నారాయణ అన్నారు. ఆయన గ్రాఫ్ విదేశాల్లో పెరుగుతుందని, అక్కడ పోటీ చేస్తే గెలుస్తారని ఎద్దేవా చేశారు. మరోవైపు ముంబైలో తలపెట్టిన ఇండియా కూటమి సమావేశానికి సీపీఐ తరఫున డి. రాజా, బినోయ్ విశ్వం హాజరవుతారని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement