Monday, July 22, 2024

Delhi | ఆశావాహుల పడిగాపులు.. రెండో లిస్టులో చోటు దక్కుతుందని ఎదురుచూపు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకుగానూ మొదటి జాబితాలో 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మిగతా స్థానాల్లో ఎవరి పేర్లు ఖరారవుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీకి క్యూ కట్టిన ఆశావహులు ఇక్కడే తిష్ట వేసి లాబీయింగ్ చేసుకుంటున్నారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానంపై గంపెడాశలు పెట్టుకున్న అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ, జడ్పీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని నేతకాని సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ పార్లమెంట్ పరిధిలో చేనేత సామాజిక వర్గానికి మూడు లక్షల ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకొచ్చారు. 2018లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశానని ఏమాజీ గుర్తు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తనకు బెల్లంపల్లి సీటు కేటాయించి చివరి నిమిషంలో బీఫామ్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికంగా పార్టీ కోసం పని చేస్తున్న తనకు సీటు కేటాయించాలని ఏమాజీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా మొదటి నుంచి పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తున్న తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. పార్టీ ఎంపిక చేసిన మూడు పేర్లలో తన పేరు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ తనకు టికెట్ ఇస్తే పెద్దపల్లిలో కచ్చితంగా విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ స్థానానికి పార్టీ నేతలు ఎస్.కుమార్, బొడిగె శోభతో పాటు ఏమాజీ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాకర్షణ కలిగిన, పాపులర్ ముఖాలకు సీటు ఇస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. 

Advertisement

తాజా వార్తలు

Advertisement