Sunday, May 19, 2024

TS | కన్నుల పండువగా.. లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణం

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి/ యదగిరికొండ : వేదమంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాలు.. కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది..సకల జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అయిన అమ్మవారికి మాంగల్యధారణ మహోన్నతంగా నిర్వహించారు. యాదాద్రి కొండపై ఓం నమో నారసింహాయ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నామస్మరణలు మిన్నంటాయి.. స్వామి వారి కల్యాణం కల్యాణం అందర్నీ ఆనంద పారవశ్యంతో నిండిన అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది.

స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవమూర్తులను వేదిక వద్ద కొలువు దీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. కొండపైన ఉత్తర ముఖ ద్వారంలోని రథ మండపం వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండపంపై కల్యాణ ఘట్టాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు.

మొదటగా ప్రధానాలయలో రాత్రి 8.45 గంటలకు గజ వాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాఢ వీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణ వేడుకలను నిర్వహించారు. విశ్వక్సేనుడికి తొలిపూజలతో ప్రారంభమై స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. స్వామి, అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు.

బ్రహ్మముహూర్తంలో నారసింహుడు మహాలక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. మాంగళ్యధారణ జరిగిన తర్వాత భక్తులు దర్శించుకునే విధంగా కల్యాణమూర్తులు, కల్యాణ లక్ష్మీనృసింహులను అధిష్టింపజేశారు. కాగా సోమవారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంలో విహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement