Saturday, October 12, 2024

గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై ముసిగిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. జస్టిస్ ఎం.ఆర్. షా, జస్టిస్ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం బెయిల్ రద్దు చేయాలా వద్దా అన్న అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సీబీఐ పిటిషన్‌పై గతంలోనే విచారణ జరగాల్సి ఉండగా.. కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బెంచ్ ముందుకు రావడంతో, ముందు ఆ కేసును చేపట్టింది. అందులో తీర్పునిచ్చిన తర్వాత బెయిల్ రద్దు వ్యవహారాన్ని పరిశీలిస్తామని చెప్పింది. ఆ మేరకు ట్రయల్ కోర్టు విచారణను తెలంగాణకు బదిలీ చేయాలంటూ తీర్పునిచ్చిన ధర్మాసనం, గురువారం బెయిల్ రద్దు వ్యవహారంపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

గంగిరెడ్డి బెయిల్ రద్దుపై అంశంపై మళ్లీ విచారణ జరపాలని ఆదేశించాల్సి వస్తే తెలంగాణ హైకోర్టును ఆదేశించాలా? లేక ఏపీ హైకోర్టును ఆదేశించాలా? అని అంటూ జస్టిస్ ఎం.ఆర్. షా ప్రశ్నించారు. గంగిరెడ్డి బెయిల్ పొందేనాటికి అసలు విచారణే జరగలేదు, కీలక విషయాలేమీ దర్యాప్తులో బయటకు రాలేదు కదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్ పొందేందుకు అవకాశం కల్పిస్తూ ఏపీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం చేశారని అనుకోడానికి ఆస్కారం ఉందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. గంగిరెడ్డికి రాజకీయ పలుకుబడి ఉన్నందున ఏదైనా సాధ్యమయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తుచేసింది.

- Advertisement -

గంగిరెడ్డికి మంజూరైన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ తరఫున న్యాయవాది నటరాజన్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో గంగిరెడ్డి పాత్ర అపరిమితమని దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు. మెరిట్ ఆధారంగా కాకుండా డిపాల్ట్ గానే గంగిరెడ్డికి బెయిల్ వచ్చిందని తెలిపారు. బెయిల్‌పై బయటికొచ్చిన నిందితుడు సాక్షులను బెదిరించినా, ప్రభావితం చేసినా, దర్యాప్తునకు ఆటంకాలు కలిగించినా బెయిల్ రద్దు చేయవచ్చని గుర్తుచేశారు. సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాతనే గంగిరెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడని నిర్ధారణ అయిందని, బెయిల్‌పై బయటికొచ్చిన తర్వాత విచారణకు ఆటంకం కలిగేలా వ్యవహరిస్తున్నాడని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అందుకే గంగిరెడ్డిని ప్రశ్నించాలని భావిస్తున్నామని నటరాజన్ చెప్పారు. ఈ సమయంలో గంగిరెడ్డి తరఫు న్యాయవాది ఆదినారాయణ రావు జోక్యం చేసుకుంటూ విచారణకు గంగిరెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తున్నాడని చెప్పారు. కావాలంటే నార్కో పరీక్షలు కూడా చేసుకోవచ్చని స్వచ్ఛందంగా గంగిరెడ్డి ముందుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

గతంలో వివేకా హత్యకేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించిన సందర్భంలో గంగిరెడ్డి సహా నిందితులు కేసులో సాక్షులను ప్రభావితం చేస్తూ సాక్ష్యాధారాలను మాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే. కొందరు సాక్షులు అత్యంత అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారని, నిందితులు కేవలం సాక్షులనే కాదు దర్యాప్తు అధికారులను సైతం బెదిరిస్తున్నారని సునీత తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో సాక్షులు స్వేచ్ఛగా, నిర్భయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో సుప్రీంకోర్ట్ ధర్మాసనం ట్రయల్ కోర్టు విచారణను తెలంగాణలోని హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ ధర్మాసనం ఇప్పుడు గంగిరెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని విచారణకు స్వీకరించింది. గురువారం ఒక్క రోజే ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణ ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement