Sunday, April 28, 2024

Delhi | ఢిల్లీ మద్యం కేసులో అప్రూవర్ అరెస్ట్.. సరికొత్త మలుపు తిరిగిన కేసు విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో మనీలాండరింగ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) శుక్రవారం మరొకరిని అరెస్టు చేసింది. తొలుత సీబీఐ కేసులో అరెస్టయి, ఆ తర్వాత అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరాను తాజాగా ఈడీ అరెస్టు చేసింది. అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టులో అరోరాను హాజరుపరిచి, వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. న్యాయస్థఆనం 4 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న దినేశ్ అరోరాను కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశించింది.

కస్టడీ కోరుతూ వాదనలు వినిపించిన ఈడీ… దినేశ్ అరోరా కొన్ని విషయాలు దాస్తున్నారని ఆరోపించింది. అందుకే అరెస్టు చేయాల్సి వచ్చిందని, కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించి ఆ విషయాలు రాబట్టాలనుకుంటున్నామని తెలిపింది. నాటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కోసం అమిత్ అరోరాతో పాటు దినేశ్ అరోరా కలిసి రూ. 2.20 కోట్లు చేరవేశారని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ ఆధారాలున్నాయని వెల్లడించింది.

అయితే దినేశ్ అరోరా ఈ కేసులో అప్రూవర్‌గా మారి విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. గత ఏడాది నవంబర్ 16న అప్రూవర్‌గా మారారని, ఈడీ పిలిచిన ప్రతిసారీ విచారణకు హజరై అన్ని విషయాలు చెప్పారని వెల్లడించారు. అప్రూవర్‌ను అరెస్టు చేయడం సరికాదని, కేసు మొత్తం మారిపోతుందని అన్నారు. అప్రూవర్‌ను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని వాదించారు.

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసును దర్యాప్తు చేస్తున్న రెండు దర్యాప్తు సంస్థలకూ దినేశ్ అరోరా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని, చెప్పాల్సిందంతా చెప్పారని వెల్లడించారు. దినేశ్ అరోరా ఇచ్చిన సమాచారం ఆధారంగానే దర్యాప్తు సంస్థలు ఇతర నిందితులకు బెయిల్ ఇవ్వలేదని కూడా గుర్తుచేశారు. మొత్తంగా అరెస్టు అక్రమమంటూ వాదనలు వినిపించినప్పటికీ, న్యాయస్థానం ఎలాంటి ఊరట ఇవ్వలేదు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement