Tuesday, April 30, 2024

Delhi | జీవో 1 పై సుప్రీంకు ఏపీ సర్కారు.. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివాదాస్పద జీవో నెంబర్ 1పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవోపై స్టే విధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా ఈ కేసులో పిటిషనర్లుగా ఉన్నారు. రోడ్లు, రహదారులపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామకృష్ణ ఏపీ హైకోర్టులో జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జీవోను జనవరి 23 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది.

అయితే జీవో అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఈ జీవో జారీచేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కొందరు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతోపాటు పంచాయితీ రాజ్ రోడ్లు, మున్సిపల్ రోడ్లపై సభలు, సమావేశాలను నిషేధిస్తూ ఈ జీవోను విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రజలకు ఇబ్బందులు కల్గించకూడదన్న ఉద్దేశంతోనే ఈ జీవో జారీ చేశామని, ప్రజలకు అసౌకర్యం కల్గని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జీవోలో పేర్కొంది. భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్గించే అంశమేదీ ఇందులో లేదని వాదిస్తోంది. ఏపీ హైకోర్టులో ఈ కేసు తదుపరి విచారణ జరగకముందే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించి వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. జీవో అమలుపై ఏపీ హైకోర్టు విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని పిటిషన్లో కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement