Monday, April 29, 2024

అమ్మ ఒడి పోయి..అమ్మ‌కానికో బ‌డి అయింద‌న్న ప‌వ‌న్ క‌ల్యాణ్..

నేటి బాల‌లే రేప‌టి పౌరులు అని నీతిసూక్తులు చెప్ప‌డ‌మే త‌ప్ప పాటించేవారు ఎవ‌ర‌ని మండిప‌డ్డారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. బాల‌ల దినోత్స‌వం సందర్భంగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో స్పందించారు. పిల్లల హక్కులకు పాటుపడాల్సిన ప్రభుత్వ పెద్దలే వారి హక్కులను హరించివేస్తున్నారని విమర్శించారు. కనీసం వారికి ఇష్టమైన మాధ్యమంలో చదువుకునే అవకాశం కూడా వారికి లేకుండా చేస్తున్నారని, మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి మా పాఠశాల తీసేయొద్దు అంటూ ఆ పసివాళ్లు ఆందోళన చేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు అమ్మ ఒడి అన్నారు, ఇప్పుడు అమ్మకానికో బడి అంటున్నారని విమర్శించారు. ఎయిడెడ్ పాఠశాలల విలీనంపై ఏపీ సర్కారు నవంబరు 12న నాలుగు ఆప్షన్లతో సర్క్యులర్ మెమో ఇచ్చిందని పవన్ వెల్లడించారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలో 2,200 ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, 2 లక్షల మంది విద్యార్థులతో పాటు 6,700 మంది టీచర్లు ప్రభావితమవుతాయని తెలిపారు.

అంతేకాకుండా 182 ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు, 71 వేల మంది విద్యార్థులు, 116 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, 2.5 లక్షల మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. ఆయా ఎయిడెడ్ విద్యాసంస్థల సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపైనా ఈ ప్రభావం పడుతుందని తెలిపారు.ముఖ్యంగా నష్టపోయేది విద్యార్థులేనని, ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం ఎందుకింత హడావుడి చేస్తుందో అర్థంకావడంలేదని వ్యాఖ్యానించారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా, ఒక అనాలోచిత విధానాన్ని అమలు చేయడం సరైన నిర్ణయమేనా అని ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement