Friday, March 29, 2024

ఢిల్లీకి అమరీందర్‌ సింగ్‌.. అమిత్‌షా, నడ్డాతో భేటీ

న్యూఢిల్లీ : పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అవుతారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సీట్ల సర్దుబాటుతో పాటు పొత్తుల అంశం గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ స్థాపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ నిర్ణయించినట్టు పంజాబ్‌ బీజేపీ ఇన్‌చార్జ్‌ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్‌ గౌతమ్‌ తెలిపారు.

గతేడాది శిరోమణి అకాలీ దల్‌ ఎన్‌డీఏ నుంచి బయటికి వచ్చింది. జాట్‌ సిక్కు ఓట్లను పొందడంలో సహాయపడే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. గత నెల సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి.. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు తన కొత్త రాజకీయ పార్టీ పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ను కూడా ప్రకటించారు. 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రైతుల నిరసనలు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కరించబడితే.. బీజేపీతో సీట్ల భాగస్వామ్య ఒప్పందానికి తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పారు. వివాదాస్పదమైన మూడు వ్యవసాయ సాగు చట్టాలను కేంద్రం ఇటీవలే రద్దు చేసింది. రైతుల ప్రయోజనాల దృష్ట్యా 2022 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో సీట్ల సర్దుబాటు జరుగుతుందని ఆశిస్తున్నాను అని వివరించారు. ధిండా, బ్రహ్మపురా వర్గాల వంటి పార్టీలతో కూడా పొత్తుపై ఆలోచిస్తున్నామని వివరించారు. కాంగ్రెస్‌ తనను అవమానించిందని ఆరోపించిన సింగ్‌, సెప్టెంబర్‌ 18న పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement