Monday, May 20, 2024

Delhi | ఎర్రకోట ప్రసంగంలో మొత్తం రాజకీయమే.. ప్రధాని మోదీపై పొన్నాల మండిపాటు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో మొత్తం రాజకీయమేనని మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎర్రకోట ప్రసంగాన్ని మోదీ రాజకీయాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు.

మణిపూర్‌లో శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని, పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశంపై ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని అన్నారు. ప్రధాని మణిపూర్‌లో పర్యటించి ప్రజలకి విశ్వాసం కలిగించి ఉంటే బాగుండేదని, కానీ అలాంటి ప్రయత్నమేదీ చేయలేదని అన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా దొంగచాటుగా వ్యాక్సిన్లు తయారు చేసే అధికారాన్ని కంపెనీలకు ఇచ్చారని ఆరోపించారు.

లాక్‌డౌన్ సమయంలో కోట్లాదిమంది ప్రజలు పట్టణాలను వీడి కాలినడక లేదంటే సైకిళ్ల మీద తమ సొంతూళ్లకు చేరుకున్నారని గుర్తుచేశారు. కోవిడ్ వ్యాక్సిన్ గురించి మాట్లాడే ప్రధాని, ఉద్యోగాలు కోల్పోయి సొంతూళ్లకు చేరుకున్న కోట్లాది కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన సమయంలో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల నుంచి ఉపశమనం ఇవ్వడం లేదని పొన్నాల అన్నారు. దేశ జనాభాలో 90 శాతం మంది సామాన్య ప్రజలే జీఎస్టీ కడుతున్నారని గుర్తుచేశారు.

తొమ్మిదేళ్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పెండింగులోనే ఉంచారని, లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉండి, ఎన్నో వివాదాస్పద బిల్లులను పాస్ చేసుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వానికి మహిళా బిల్లు ఎందుకు పట్టడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కూడా తొమ్మిదేళ్లుగా పెండింగులో ఉందని, తొమ్మిదేళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన నీచ ప్రభుత్వం బీజేపీ అని పొన్నాల లక్ష్మయ్య తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -

తేలని జనగామ డీసీసీ పంచాయితీ

జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులుగా కొమ్మూరి ప్రతాప రెడ్డి నియామకాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కొద్ది రోజుల క్రితం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని కూడా కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పొన్నాల ఇచ్చిన ఫిర్యాదు లేఖపై స్పందిస్తూ ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిందిగా ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు సూచించినట్టు తెలిసింది.

మొత్తంగా కేసీ వేణుగోపాల్ కార్యాలయం నుంచి అందిన పిలుపు మేరకు మంగళవారమే ఢిల్లీ చేరుకున్న పొన్నాల లక్ష్మయ్య, ఆయన చెప్పిన సమయంలో కలిసేందుకు ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. అయితే అనుకోకుండా ఆయనకు రాహుల్ గాంధీ నుంచి ఫోన్ కాల్ రావడం, వేరే రాష్ట్రాల అంశాల్లో వరుస సమావేశాలతో బిజీ అయిపోవడంతో మంగళవారం పొన్నాల కలవలేకపోయారని తెలిసింది. తదుపరి అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న పొన్నాల.. జనగామ వ్యవహారంతో పాటు పార్టీలో ఓబీసీలకు ప్రాధాన్యత లేకపోవడంపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది.

తెలంగాణ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో 1983 నుంచి సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందని, మూడు పర్యాయాలు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చేపట్టిన సమయంలోనూ తెలంగాణలో గెలిచిన సీట్లు సగం కూడా లేవని పొన్నాల చెబుతున్నారు. ఇందుక్కారణం బీసీ ఓటర్లు కాంగ్రెస్ వీడి వెళ్లిపోవడమేనని ఆయన సూత్రీకరిస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలకు కొన్ని సీట్లు ఇచ్చామని చెప్పుకోవడం తప్పితే, పార్టీ ప్రక్రియలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ నియమావళిని పక్కనపెట్టి స్థానికేతరుడైన కొమ్మూరి ప్రతాపరెడ్డికి జనగామ డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై కూడా ఆయన నిరనస వ్యక్తం చేస్తున్నారు. పలు పార్టీలు మారి, కాంగ్రెస్‌ను గతంలో తీవ్రంగా విమర్శించిన వ్యక్తికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే.. జిల్లాలోని పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తాయని ప్రశ్నిస్తున్నారు. కేసీ వేణుగోపాల్‌తో జరిగే సమావేశంలో ఇవే అంశాలను ఆయన ప్రస్తావించనున్నట్టు తెలిసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement