Friday, May 3, 2024

ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం

ఆకాశ మార్గంలో రెండు విమానాలు ఎదురెదురుగా ప్రయాణిస్తే ఏమైనా ఉందా? ఆ రెండు విమానాల్లో ఉన్నవారి సంగతి సరేసరి. కానీ అలాంటి ఘటన ముంబై పరిసర ప్రాంతంలో జరిగింది. అయితే ఆకాశంలో రెండు విమానాలు చాలా దగ్గరకు వచ్చిన తర్వాత అలెర్ట్‌ కావడంతో అవి ఢీకొనే ప్రమాదం తప్పింది. జనవరి 29న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇటీవల విడుదల చేసింది. జనవరి 29న ఎయిర్ ఏషియాకు చెందిన అహ్మదాబాద్‌-చెన్నై విమానం, ఇండిగోకు చెందిన బెంగళూరు-వడోదర విమానం ముంబై గగనతలంలో ఎదురెదురుగా చాలా దగ్గరకు వచ్చాయి. ఇవి 8 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇండిగో విమానం 38,000 అడుగుల ఎత్తులో, ఎయిర్ ఏషియా విమానం 38,008 అడుగుల ఎత్తులో ఎదురెదురుగా ఉన్నాయి. ఆ రెండు విమానాల మధ్య దూరం 6.5 కిలోమీటర్లు ఉండగా ఎయిర్‌ ఏషియా విమానంలోని వ్యవస్థ పైలట్లను హెచ్చరించింది. విమానాన్ని మరింత ఎత్తులోకి తీసుకెళ్లాలని అప్రమత్తం చేసింది. దీంతో ఆ విమానం 38,396 అడుగుల ఎత్తుకు చేరడంతో ఆ రెండు ఢీకొనే ప్రమాదం తప్పింది.

అయితే రెండు విమానాల పొజిషన్‌ను అంచనా వేయడంలో ముంబై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ విఫలమయ్యారని ఆ నివేదిక పేర్కొంది. ఆటోమేటిక్‌ సిస్టమ్‌ హెచ్చరించినప్పటికీ రెండు విమానాలను హెచ్చరించడంలో కంట్రోలర్‌ నిర్లక్ష్యం వహించారని ఆరోపించింది. కాగా, సాధారణంగా అహ్మదాబాద్‌ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్లే విమానాలు భావనగర్ మీదుగా ప్రయాణిస్తాయి. అయితే ఆ రోజున ఎయిర్‌ ఏషియా విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండిగ్‌ మార్గంలో ప్రయాణించింది. ఎయిర్‌ ఏసియా విమానం తన మార్గాన్ని మార్చుకోవడంతో అదే మార్గంలో వస్తున్న ఇండిగో విమానం సమీపానికి వచ్చింది. చివరకు ఎయిర్‌ ఏసియా విమానంలోని వ్యవస్థ హెచ్చరించడంతో ఎత్తు పెంచడంతో ఆ రెండు విమానాలు 300 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల సమీపంలో క్రాస్ అయ్యాయి. ఎయిర్‌ ఏషియా విమానం సాధారణ రూట్‌లోనే ప్రయాణిస్తోందని కంట్రోలర్‌ భావించడం వల్ల లేదా మద్యం మత్తులో ఉండటం వల్ల ఇది జరిగి ఉంటుందని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement