Tuesday, April 30, 2024

America Lander: 50 ఏళ్ల త‌ర్వాత జాబిల్లిపై అమెరికా ల్యాండ‌ర్.. చంద‌మామ‌పై తొలి ప్రైవేటు ల్యాండర్

జాబిలిపైకి ల్యాండర్ల పరంపర కొనసాగుతోంది. జపాన్ ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ తర్వాత తాజాగా అమెరికా వంతు వచ్చింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడిపై మరోమారు అగ్రరాజ్యం జెండా రెపరెపలాడింది. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో హూస్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు సంస్థ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ రూపొందించిన ‘ఒడిస్సియస్’ (నోవా-సీ శ్రేణి) ల్యాండర్ జాబిలి ఉపరితలంపై దక్షిణ ధ్రువం చేరువలోని ‘మాలాపెర్ట్ ఎ’ బిలంలో దిగ్విజయంగా దిగింది. ముందుగా ల్యాండర్ దిగాల్సిన నిర్దేశిత సమయంలో కొంత జాప్యం సంభవించినప్పటికీ భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 4:53 గంటలకు అది క్షేమంగా చంద్రుడిపై దిగి భూమికి సంకేతం పంపింది.

‘మాలాపెర్ట్ ఎ’ అనేది చంద్రుడి దక్షిణ ధృవానికి 300 కిలోమీటర్ల దూరంలో 85 డిగ్రీల దక్షిణ అక్షాంశ ప్రాంతంలో నెలకొన్న ఓ చిన్న బిలం. బెల్జియంకు చెందిన 17వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త చార్లెస్ మాలాపెర్ట్ పేరును దానికి పెట్టారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి అతి సమీపంలో దిగిన వ్యోమనౌకగా చరిత్ర సృష్టించిన ‘ఒడిస్సియస్’… ఆ విషయంలో గత ఏడాది మన చంద్రయాన్-3 ‘విక్రమ్’ ల్యాండర్ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టడం విశేషం.

‘ఒడిస్సియస్’ ల్యాండరుకు ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ సంస్థ ఉద్యోగులు పెట్టుకున్న ముద్దు పేరు ‘ఒడీ’. ఈ మానవరహిత చంద్రయాత్రకు మిషన్ ‘ఐఎం-1’గా నామకరణం చేశారు. జీవితకాలం ఏడు రోజులే! పూర్తిగా ఓ ప్రైవేటు కంపెనీ తయారీ-నిర్వహణలో ల్యాండర్ ఒకటి చంద్రుడి ఉపరితలంపై సజావుగా దిగడం ఇదే తొలిసారి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement