Monday, April 29, 2024

ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల సర్దుబాటు.. కోర్సుల రద్దుకు అనుమతి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆదరణ లేని కోర్సులను ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలు రద్దు చేసుకున్నాయి. ఈ కోర్సులకు సంబంధించిన సీట్లను డిమాండ్‌ ఎక్కువగా ఉన్న కోర్సులకు సర్దుబాటు చేసుకున్నాయి. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల సర్దుబాటు, కోర్సుల రద్దుకు అనుమతులిచ్చింది. జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు 2022-23 విద్యా సంవత్సరానికి అనుమతులిస్తూ జీవో ఆర్టీ నెం.170ను మంగళవారం విడుదల చేసింది. సివిల్‌, మెకానికల్‌ కోర్సుల్లో సీట్లను తగ్గించుకున్న కాలేజీలు కంప్యూటర్‌ కోర్సుల్లో మాత్రం భారీగా సీట్లను పెంచుకున్నాయి. తొమ్మది వేలకుపైగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఇతర ఐటీ కోర్సుల్లో సీట్లు పెరిగాయి.

మెకానికల్‌, ఎలక్రికల్‌, సివిల్‌, మైనింగ్‌ తదితర ఇంజనీరింగ్‌ సీట్లు పూర్తి స్థాయిలో నిండడంలేదు. యాజమాన్య కోటాలో చేరేందుకు ఎవ్వరూ ఇష్టపడటం లేదు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఐటీ కోర్సులతో పోల్చితే ఇతర కోర్సులతో కాలేజీలకు పెద్దగా లాభాలు ఉండటం లేదని కాలేజీ యాజమాన్యాల వాదన. రాష్ట్రంలో మొత్తం 178 ఇంజనీరింగ్‌ కాలేజీలున్నాయి. మొత్తం ఇంజనీరింగ్‌ సీట్లల్లో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేయగా, 30 శాతం సీట్లను కాలేజీలు యాజమాన్య కోటాలో నింపుకొవచ్చు. ఈ కోటాలో ఇష్టారాజ్యంగా కాలేజీలు ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. పైగా సీఎస్‌ఈ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌) లాంటి కోర్సులైతే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతాయి. గతేడాది నుంచి సీఎస్‌ఈలో భాగంగా ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్‌, రోబోటిక్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), సైబర్‌ సెక్యూరిటీ లాంటి కోర్సులకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. దీంతో డిమాండ్‌ లేని సీట్లను రద్దు చేసుకుని ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులను పొందవచ్చని ఏఐసీటీఈ గత ఏడాది ప్రకటించడంతో కాలేజీలు భారీగా దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో సివిల్‌ మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, మైనింగ్‌ తదితర ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లను రద్దు చేసుకుని సీఎస్‌కు సీట్లను పెంచుకున్నాయి. ఇటీవల జరిగిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటా 71,286 సీట్లుండగా 60,208 సీట్లు భర్తీ అయ్యాయి.

ఆ విద్యార్థుల కోసం అధ్యాపకులను కొనసాగించాలి…

కోర్సు రద్దు, సీట్ల సర్దుబాటుతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేపరిస్థితి ఉంది. దీంతో ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి చదువు పూర్తయ్యేంత వరకూ ఆ కోర్సుకు సంబంధించిన వసతులు, అధ్యాపకులను కూడా కొనసాగించాల్సి ఉంటుంది. అనేక కాలేజీలు కోర్సు రద్దు చేసుకున్న తర్వాత అధ్యాపకులను తొలగించి, ల్యాబ్‌లను మూసేస్తున్నాయి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement