Sunday, May 5, 2024

Big story | పక్కాగా లెక్క.. ప్రతీ అడుగుపై ముందే బ్లూప్రింట్‌ రెడీ చేసుకున్న కేసీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: భారత రాష్ట్రసమితి అడుగులు.. పక్కాగా పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతీ దశనూ ముందే దర్శించి రూపొందించిన వ్యూహం పకడ్బందీగా అమలుచేస్తున్నారు. 2024 ఎన్నికల్లో.. కనీసం 75లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యం సీఎం కేసీఆర్‌ నిర్దేశించి.. కార్యాచరణ అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో రాష్ట్రం నుండి ఇపుడువస్తున్న స్పందనకు, రానున్నరోజుల్లో వచ్చే ఆశ్చర్యకర ఫలితాలకు సంబంధం ఉండదని సీఎం చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆరంభింపరు నీచమానవులు.. అంటూ ఉన్నపద్యాన్ని ఉటంకిస్తూ తన రాజకీయ జీవితం ప్రతీదశలోనూ హేలనతో మొదలై ఉన్నత స్థితికి చేరిందని, బిఆర్‌ఎస్‌ ప్రస్థానం దేశాన్ని శాసించేస్థాయిలో పురోగమిస్తుందని సీఎం పార్టీ ముఖ్యుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

తాను సిద్దిపేటలో ఇంటింటికీ మంచినీళ్ళు అన్నపుడు హేళన చేశారని, కానీ సాకారమైంది చూశారని, తర్వాత ఆర్టీసీ మంత్రిగానూ.. చెప్పి మరీ లాభాల బాట పట్టించానని, తెలంగాణ సాధించుకున్నామని, సాధించుకున్న తెలంగాణలో కరెంట్‌ సమస్యను ఎలా ఖతం పెట్టామో చూశారని సీఎం ముఖ్యనేతలకు వివరించినట్లు తెలిసింది. 24గంటల కరెంట్‌ సాధ్యం కాదని ఒకవేళ ఇస్తే ఎంతో అనుభవమున్న ప్రతిపక్ష నేత తాను గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పారని.. ఇలా ప్రతి మజిలీలో ఎన్నో అవహేళనలు అధిగమించి సాధించామని.. బిఆర్‌ఎస్‌ కూడా ఇదే పంథాలో ఉంటుందని సీఎం చెప్పినట్లు సమాచారం. ఖమ్మం బిఆర్‌ఎస్‌ సభ ద్వారా సీఎం పలు లక్ష్యాలు నిర్దేశించుకోగా, కేసీఆర్‌ ఎత్తుగడలు ఊహకు అందవని పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు.

- Advertisement -

ఆ తర్వాతే జోరు..

ఖమ్మం శంఖారావం తర్వాత బిఆర్‌ఎస్‌ కార్యకలాపాల జోరు విస్తరిస్తుందని భావిస్తున్నారు. అంతర్గతంగా చాలా పని జరుగుతోంది. బిఆర్‌ఎస్‌ ను ప్రకటించి.. ఇంకా ఎజెండాలు, విధానాలు చెప్పకముందే ఇతర రాష్ట్రాల నుండి అనేకమంది నేతలు వచ్చి కలుస్తున్న పరిస్థితి ఉన్నది. ఎపిలో కాపువ్యూహం ప్రకంపనలు రేపుతున్నది. శుక్రవారం ఒడిస్సా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌, ఆయన తనయుడు వచ్చి కలిశారు. రాజకీయాల్లో తలపండిన అనేకమంది నేతలు తమ వారసుల భవిష్యత్తును కేసీఆర్‌ చేతిలో పెడుతున్నారు. నాగాలాండ్‌ కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సీఎంను కలిశారు. ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన రాష్ట్రపార్టీ మొత్తం విలీనం చేయడానికి రెడీగా ఉన్నారు. తమిళనాడుకు చెందిన పలువురు ఎమ్మెల్యేలున్న ఓ పార్టీ కూడా విలీనానికి రెడీగా ఉన్నది. దేశవ్యాప్తంగా 13 ఉప ప్రాంతీయపార్టీలతో గతంలోనే చర్చలు పూర్తిచేసిన సీఎం కేసీఆర్‌ సరైన ముహూర్తం చూసి.. విలీనం ప్రకటిస్తారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

ద్విముఖ వ్యూహం

పార్టీని బలోపేతం చేస్తూ.. కాంగ్రెస్‌, ఇతర పార్టీలు విఫలమైన చోట బిఆర్‌ఎస్‌ వేగంగా విస్తరించే అవకాశాలను గుర్తించి కార్యాచరణ అమలుచేస్తున్నారు. విలీనాలు, విధానాల ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ.. 75 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ అమలుచేయాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం సభ ద్వారా వామపక్షాలతో మైత్రిని మరింత పటిష్టం చేసుకునే వ్యూహాన్ని కూడా అమలుచేస్తున్నారు. బిజెపి, కాంగ్రెస్‌లకు దూరంగా ఉన్న వామపక్షాలు, ఆప్‌, ఎస్పీ, జెడిఎస్‌ వంటి పార్టీలతో కలిసి ముందుకు సాగుతూ ఫెడరల్‌ ఫ్రంట్‌ను కూడా బలోపేతం చేయాలని.. ద్విముఖ వ్యూహం ద్వారా దేశంలో 2024 ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారాలన్న వ్యూహాన్ని బిఆర్‌ఎస్‌ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఖమ్మం సభ కీలక మలుపుగా సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం నాడి స్వయంగా పట్టేందుకు గురువారం కొత్తగూడెంలో పర్యటించిన కేసీఆర్‌.. ఖమ్మం నుండే ఇటు తెలంగాణ, అటు ఆంధ్రా, ఛత్తీస్‌గడ్‌, ఒడిస్సాలపై ప్రభావం చూపే వ్యూహరచన చేస్తున్నారు. ఎపి నేతలు కూడా ఖమ్మం సభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

సంక్రాంతి చర్చ బిఆర్‌ఎస్సే

ఆంధ్రాలో సంక్రాంతి సందర్భంగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌ పై పెద్ద ఎత్తున చర్చ పెట్టాలని, గ్రామాల్లోకి ఒక్కటిగా చేరిన ప్రజల్లోకి బిఆర్‌ఎస్‌ సీరియస్‌గా దృష్టిపెట్టిందన్న వాతావరణం, సామాజిక సమీకరణలతో రాజకీయంగా కలిసొస్తుందని అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జరిగే చర్చలు ఆ తర్వాత జరిగే బహిరంగసభకు ఆంధ్రా నుండి ఖమ్మంకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు కూడా దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో దేశరాజకీయాల్లో మార్పులకు తెలంగాణ కేంద్రబిందువుగా మారుతుందన్న అభిప్రాయాన్ని నేతలు ధీమాగా చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement