Monday, April 29, 2024

మనిషి అంతిమ క్షణాల్లో మెదడులో అలజడి.. తాజా అధ్యయనం వెల్లడి

మనిషి మెదడు రహస్యాల పుట్ట. ఆ గుట్టు విప్పేందుకు మానవ మేధ నిరంతరం శోధిస్తూనే ఉంది. మనిషి మరికొద్ది క్షణాల్లో మరణిస్తాడనగా మెదడు పనితీరు ఎలా ఉంటుంది… అక్కడ ఎటువంటి మార్పులు జరుగుతాయి… మరణించే ముందు ఆయా వ్యక్తులు దివ్యమైన కాంతిని అంతర్ముఖంగా చూస్తున్నారా? కలలు నిజమేనా.. ఎందుకొస్తాయి? మెదడులో ఏ భాగం వీటికి కారణం… ఇలాంటి సందేహాలకు జవాబు చెప్పేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మనిషి మరికొద్ది క్షణాల్లో మరణిస్తానడగా మెదడులో జరిగే మార్పులేమిటన్న దానిపై తాజా అధ్యయనం ఓ రహస్యాన్ని కనిపెట్టింది.

మొదడులోని ఓ ప్రత్యేక భాగంలో గామా (గమ్మా) తరంగాల ఉధృతి ఉన్నట్టుండి పెరిగిపోతున్నదని.. ఆ తరువాత క్షణాల్లో ఆ మనిషి ప్రాణాలు కోల్పోతారని తేలింది. కోమాలో ఉన్న నలుగురు రోగుల మెదళ్ల ఈఈజీ, ఈసీజీ సంకేతాలను విశ్లేషించిన నాడీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆ పరిశోధనల సారాంశాన్ని ప్రఖ్యాత నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ప్రచురించారు. అందులో వారు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. చివరి వరకు మెదడు చురుకుగానే పనిచేస్తుందని.

- Advertisement -

జంతువుల్లో మరణానికి ముందు వాటి మెదళ్లలో జరిగే మార్పులపై గతంలో పరిశోధనలు చేశారు. మెళకువగా ఉన్న ఓ కోతిపైనా గామా తరంగాల పనితీరును విశ్లేషించారు. అంతిమఘడియల్లో వివిధ జంతువుల మెదళ్లలో గామా తరంగాలు ఉప్పెనలా ఎగసిపడటం.. గుండె ఆగిపోవడం లేదా ఊపిరితిత్తులు విఫలమై మరణిస్తాయని తేల్చారు. ఇప్పుడు మానవుల్లో మరణించే ముందు మెదడులో జరిగే మార్పులపై ఇప్పుడు అధ్యయనం చేశారు. అమెరికాలోని ప్రఖ్యాత మిచిగన్‌ యూనవర్శిటీకి చెందిన న్యూరో సైంటిస్టులు ఈ పరిశోధనలు నిర్వహించారు. కోమాలో ఉన్న నలుగురు రోగులు ఇక మరణిస్తారని నిర్ధారణ అయ్యాక వారి మెదళ్లపై పరిశోధనలు చేసింది.

వెంటిలేటర్‌ పెట్టిన తరువాత, వెంటిలేటర్‌ తీసేసిన మరుక్షణం ఈఈజీ (ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌, ఈసీజీ (ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌) పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను విశ్లేషించారు. వెంటిలేటర్‌ తీసేసిన మరుక్షణంలో మెదడులో హాట్‌జోన్‌గా భావించే ఒక భాగంలో గమ్మా తరంగాలు ఉన్నట్టుండి పెరిగినట్లు గుర్తించారు. ఆ తరువాత కొద్ది క్షణాలకు ఆ రోగి గుండె ఆగిపోవడం లేదా ఊపిరితిత్తులు విఫలమైనట్లు గుర్తించారు. ఆ హాట్‌ జోన్‌కు మెదడు రెండువైపులా సంబంధాలున్నాయి. మిచిగన్‌ అకడమిక్‌ మెడికల్‌ సెంటర్‌లో 2014 నుంచి న్యూరో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో మరణించిన రోగుల మెదళ్లపై జరిగిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.

మరణం అంచులవరకూ వెళ్లి బతికినవారి (క్లినికల్‌ డెత్‌ దశ నుంచి బతికినవారి) అనుభవాలు, కథనాల ప్రకారం వారు బాహ్యమైన స్పృహలో లేనప్పటికీ… అంతర్ముఖంగా దివ్యమైన కాంతిని, బాగా అనుబంధం/తెలిసినవారి ముఖాలను చూశారు. దీని ఆధారంగా శాస్త్రవేత్తలు కొన్ని అధ్యయనాలు చేశారు. ఆయా వ్యక్తులు మరణించడానికి కొన్ని క్షణాల ముందు అలా అంతర్గత దృశ్యవీక్షణ శక్తిని మెదడు కల్పిస్తోందని, ఆ సమయంలో మరణించడానికి ముందు మెదడులోని వెనుకభాగాలు చైతన్యవంతమవుతున్నాయా లేదా అన్నది ఇంకా రూఢీ కాలేదని పరిశోధకులు చెబుతున్నారు.

మెదడులోని నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేయడంలో న్యూరాన్ల చలనం కీలకం. ఇలా మెదడులో హాట్‌జోన్‌గా భావించే భాగంలో గమ్మా తరంగాలు (నాడీవ్యవస్థలోని న్యూరాన్ల కదలికలు) ఒక రిథమ్‌లో కదులుతూంటాయి. మెదడులోని మధ్య, కీలకమైన నాడీ వ్యవస్థలో ఈ తరంగాలుంటాయి. మనిషిలో ఈ తరంగాల పౌన:పున్యం 25 నుంచి 140 హెర్జెస్‌తో ఉంటాయి. 40 హెర్జెస్‌ పౌన:పుణ్యంతో ఉన్నప్పుడు ఈ తరంగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గమ్మా తరంగాలు మనిషి ఆలోచన, జ్ఞాపకం, జ్ఞానాన్ని సముపార్జించుకునే ఇస్తాయి.

మనిషి స్పృహలో ఉండటం, అప్రమత్తంగా ఉండటం, కలలు కనడం, మూర్ఛపోవడం వంటి ప్రక్రియలకు కేంద్రం మెదడులోని హాట్‌జోన్‌. మనిషి అంతిమక్షణంలో కూడా మెదడు చురుకుగానే పనిచేస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. అయితే తాజా అధ్యయనంలో కనిపెట్టిన అంశాలకు సంబంధించి ఇంకా లోతుగా విశ్లేషణలు, పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. మనిషి గుండెపోటుకు గురైనప్పుడు మెదడులో జరిగే మార్పులు, పాత్రపై పరిశోధనలు జరగాలని వారు అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement