Wednesday, May 15, 2024

ప్రజాస్వామ్య భారత సజీవ ప్రతిబింబం.. ప్రధాని సంగ్రహాలయంపై ఉపరాష్ట్రపతి మనోగతం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కొత్తగా ఏర్పాటైన ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ప్రజాస్వామ్య భారత సజీవ ప్రతిబింబం అంటూ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు కొనియాడారు. సోమవారం ఆయన దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించారు. అనంతరం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఫేస్‌బుక్‌లో తన పేజిపై సుదీర్ఘంగా మనోగతాన్ని పంచుకున్నారు. స్వరాజ్యం సముపార్జించుకున్న తర్వాత 75 సంవత్సరాల్లో భారతదేశ ప్రధానమంత్రుల కృషిని వివరిస్తూ, వారి గొప్పతనాన్ని స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప స్మారక చిహ్నంగా సంగ్రహాలయాన్ని అభివర్ణించారు. “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌”లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాస్వామ్య భారతావనికి ప్రేరణ చిహ్నంగా నిలిచే ఈ సంగ్రహాలయాన్ని ఇటీవల ప్రారంభించారు. ప్రపంచంలో అతి పెద్ద, అత్యంత చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశాల్లో భారత్ ఒకటి కావడం భారతీయులంతా గర్వించాల్సిన అంశమని, ఈ ప్రదర్శనశాల భారతదేశ ప్రజాస్వామ్యపు శక్తివంతమైన స్వభావానికి సజీవ ప్రతిబింబమని వెంకయ్య నాయుడు తెలిపారు. సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా దేశ అత్యున్నత, అసాధారణ రాజ్యాంగ పదవులకు చేరుకోగల్గడమే భారతదేశ ప్రజాస్వామ్య గొప్పదనమని అన్నారు.

శతాబ్దాల పాటు సాగిన వలస పాలన మన ఆర్థిక వ్యవస్థను ఎలా నాశనం చేసిందో, మనల్ని ఏ విధమైన దుర్భర పరిస్థితుల్లోకి నెట్టిందో ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా సంగ్రహాలయంలోని ప్రదర్శనశాల ఉందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆధునిక గణతంత్ర దేశంగా భారతదేశపు ప్రయాణం అనేక సవాళ్ళతో కూడుకోవడంలో ఎలాంటి ఆశ్యర్యం లేదు. అయితే అదే సమయంలో సమగ్రాభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న భారతదేశపు ఐక్యత, సమగ్రతను కాపాడటమే కాకుండా, విశాలమైన దేశానికి సమగ్రమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడమనే రెండు అతి పెద్ద సవాళ్ళకు సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబాసాహెబ్ అంబేడ్కర్‌ వంటి నాయకుల సమర్థవంతమైన నేతృత్వంలో విజయవంతమైన పరిష్కారం లభించిందని గుర్తుచేసుకున్నారు. ఈ సంగ్రహాలయంలో రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తల గాథలను సవివరంగా వివరించడం గొప్ప అనుభూతిని, ఆనందాన్ని అందించిందని తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశపు భాషా వైవిధ్యానికి గుర్తుగా 22 భారతీయ భాషల్లో రాజ్యాంగం ప్రతులను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారికైనా సంగ్రహాలయానికి సంబంధించిన సంపూర్ణమైన సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మాతృభాషే మన సంస్కృతికి మూలమని తానెప్పుడూ చెబుతుంటానని, అటువంటి మాతృభాషలను ప్రోత్సహించుకోవటంతో పాటు నిరంతర వినియోగం ద్వారా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

ప్రధాన ప్రాంగణంలో గాల్లో తేలియాడుతున్న నాలుగుసింహాల జాతీయ చిహ్నం, కైనెటిక్ లైట్స్‌తో అద్భుతంగా కనిపించే త్రివర్ణ పతాకం వంటివి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ఫేస్ బుక్ పేజిలో రాసుకున్నారు. గత ప్రధానులు అందుకున్న బహుమానాలు, కానుకలను కూడా ఈ సంగ్రహాలయంలో సందర్శనకు ఉంచారని, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చలువ కళ్లద్దాలు, వారి వ్యక్తిగత పెన్నును అక్కడ చూసిన తర్వాత కాస్త ఉద్వేగానికి గురయ్యానని అన్నారు.

అనుభూతి విభాగంలోని ‘సెల్ఫీ విత్ పీఎం’, ‘చైన్ ఆఫ్ యూనిటీ’, భవిష్యత్ భారతాన్ని చూపించే ‘వర్చువల్ హెలికాప్టర్ టూర్’ వంటి సృజనాత్మకమైన ఆలోచనలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి అన్ని వయసుల వారికి ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. అక్కడ ఏర్పాటుచేసిన డిజిటల్ వాల్ పైన ఎవరైనా భవిష్యత్ భారతానికి సంబంధించి తమ ఆలోచనలను పంచుకునేలా ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా సేకరించిన డేటాను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ డేటాలోని మంచి ఆలోచనలను భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకోబోయే విధానాల రూపకల్పనలో పరిగణించేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాసుకొచ్చారు. కచ్చితంగా ఈ మ్యూజియం అంతర్జాతీయ స్థాయిలో ఉందని చెప్పేందుకు తానేమాత్రం సందేహించనని అన్నారు. మరీ ముఖ్యంగా నేటి యువత ఈ సంగ్రహాలయాన్ని సందర్శించి భారతదేశ వివిధ ప్రధానమంత్రులు చేసిన కృషి, సేవల గురించి తెలుసుకుని ప్రేరణ పొందడం ద్వారా నవ, సమృద్ధ, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో మరింత ఉత్సాహంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ తన పోస్టును ముగించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement