Thursday, April 25, 2024

బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణకు 89,000 కోట్లతో ప్యాకేజీ..

కేంద్ర మంత్రి వర్గం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌) పునరుద్ధరణకు మూడో ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. 89,047 కోట్లతో ప్రభుత్వం ఈ ప్యాకేజీని అమలు చేయనుంది. దీనితో అధీకృత మూల ధనాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ 1.50 లక్షల కోట్ల నుంచి 2.10 లక్షల కోట్లకు పెంచనుంది. ప్రభుత్వ రంగంలోని టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం 4జీ, 5జీ స్పెక్ట్రమ్‌ను కెటాయించేందుకు అంగీకరించింది. 46,338.60 కోట్ల విలువైన 700ఎంహెచ్‌జడ్‌, 26,184.20 కోట్ల విలువైన 3,300 ఎంహెచ్‌జడ్‌, 6,564.93 కోట్ల విలువై 26 జీహెచ్‌జడ్‌, 9,428.20 కోట్ల విలువైన 2,500 ఎంహెచ్‌జడ్‌ స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించనున్నారు.

అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో 4జీ కనెక్టివిటి అందించనుంది. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ను ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్‌ క్సెస్‌(ఎఫ్‌డబ్ల్యుఏ) సర్వీస్‌లను అందించనుంది. క్యాప్టివ్‌ నాన్‌ పబ్లిక్‌ నెట్‌వర్క్‌ సేవలను అందించనుంది. ఈ ప్యాకేజీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ స్థిరమైన టెలికం సర్వీస్‌ ప్రొవైడర్‌గా నిలుస్తుందని, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటిని అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సరైన మౌలిక సదుపాయలు లేకపోవడంతో ప్రైవేట్‌ ఆపరేటర్లతో ధీటుగా టెలికం సేవలను అందించలేకపోతున్నది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎన్ని సార్లు ఎంతగా కోరినా ఇప్పటి వరకు 4జీ స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం కేటాయించలేదు. 5జీ విషయంలోనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ అందరితో పాటు తమకు కేటాయించాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు.

- Advertisement -

4జీ, ఇప్పుడు 5జీ కస్టమర్లు పూర్తిగా ప్రైవేట్‌ టెలికం సేవల్లోకి వెళ్లిన తరువాత బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేవలం పెద్దగా ఆదాయం రాని గ్రామీణ ప్రాంతాలకు ఈ సేవలను అందించాలని ప్రభుత్వం కోరుతున్నది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా ఇప్పటికే 4జీ సేవలను దేశంలోని అన్ని ప్రాంతాలకు అందిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 2019లో మొదటిసారి 69,000 కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. మరోసారి 2022 జులైలో కేంద్రం 1.64 లక్షల కోట్లతో రెండోసారి పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. రెండో సారి ప్యాకేజీని 4జీ, 5జీ సర్వీస్‌లు అందించేందుకు వీలుగా కేటాయించారు. ఈ ప్యాకేజీలో 43,964 కోట్లు నగదుగానూ, 1.2 లక్షల కోట్లు నాలుగు సంవత్సరాల కోసం నాన్‌ క్యాష్‌ కంపోనెంట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

కేంద్ర ప్రకటించిన ప్యాకేజీలు ప్రధానంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవల్లో నాణ్యత పెంచేందుకు, సాంకేతిక పరిజ్జానాన్ని సమకూర్చుకునేందుకు ఉద్దేశించారు. సంస్థ బ్యాలెన్స్‌ షిట్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు దీన్ని వినియోగించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అందిస్తున్న అప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను ఈ నిధులతో బలోపేతం చేయనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్యాలెన్స్‌ షీట్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా 33,404 కోట్ల చట్టబద్దమైన బకాయిలను ఈక్విటీగా మార్చనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ చెప్పారు. భారత్‌ బ్రాడ్‌ బాండ్‌ నెట్‌వర్క్ లిమిటెడ్‌(బీబీఎన్‌ఎల్‌)ను బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌కు అదనంగా 5.67 లక్షల కిలోమీటర్ల అప్టికల్‌ ఫైబర్‌ లైన్స్‌ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ లైన్స్‌ దేశంలోని 1.85 లక్షల గ్రామ పంచాయితీలకు విస్తరించి ఉన్నాయి.

ప్రభుత్వ రంగంలో ఉన్న టెలికం సంస్థ వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు ప్యాకేజీల తరువాత బీఎస్‌ఎన్‌ఎల్‌ రుణాలు 32,944 కోట్ల నుంచి 22,289 కోట్లకు తగ్గాయి. మే నెలలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ టీసీఎస్‌ ఆధ్వర ్యంలోని కన్సార్టియంకు 15 వేల కోట్ల విలువైనఅడ్వాన్స్‌డ్‌ పర్చేజింగ్‌ ఆర్డర్‌ను ఇచ్చింది. ఐటీఐ లిమిటెడ్‌కు 4జీ టెలికం గేర్స్‌ కోసం 3,889 కోట్ల విలువ ఆర్డర్లు ఇచ్చింది. టీసీఎస్‌తో పాటు, ప్రభుత్వ రంగ సంస్థ టెలికం టెక్నాలజీ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ సీ-డాట్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌కు లక్ష 4జీ సైట్స్‌ను సరఫరా చేయనున్నాయి. మరో ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ లిమిటెడ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌కు 23,633 4జీ సైట్స్‌ను అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement