Thursday, April 25, 2024

4,300 రష్యన్‌ ఆర్మీని హతమార్చాం, 27 యుద్ధ విమానాలు, 146 యుద్ధ ట్యాంకులు ధ్వంసం: ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌, రష్యా మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. రాజధాని నగరం కీవ్‌లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నిస్తున్నది. అయితే ఉక్రెయిన్‌ సైన్యం శక్తివంచన లేకుండా రష్యా దళాలు తిప్పికొడుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌ డిప్యూటీ రక్షణ మంత్రి హన్నా మాల్యర్‌ సంచలన ప్రకటన చేశారు. తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీ మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. ఉక్రెయిన్‌ సైన్యం.. రష్యాకు చెందిన 4,300 మంది సైనికులను హతమార్చిందని హన్నా మాల్యార్‌ వెల్లడించారు. ఇది ధృవీకరించిన సంఖ్య అని కూడా తెలిపారు. అంతేకాదు రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులు, 27 యుద్ధ విమానాలు, 26 హెలికాప్టర్లను ఉక్రెయిన్‌ ఆర్మీ ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మూడు రోజుల్లో చనిపోయిన రష్యా సైనికుల సంఖ్య ఇది అని హన్నా మాల్యార్‌ వివరించారు. 49 కేనన్స్‌, బల్క్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ ఒక దానిని తమ సైన్యం నాశనం చేసినట్టు తెలిపారు. అలాగే రష్యాకు చెందిన 4 గ్రేడ్‌ మల్టిపుల్‌ రాకెట్‌ లాంచ్‌ సిస్టమ్స్‌, 30 ఇతర వాహనాలు, 706 ఆర్మ్‌డ్‌ ఫైటింగ్‌ వెహికిల్స్‌, 60 ట్యాంకర్లు, 2 డ్రోన్లు, 2 బోట్లనూ ధ్వంసం చేసినట్టు ప్రకటించారు.

210 మంది పౌరులు మృతి..

రష్యా దాడుల్లో.. 210 మందికిపైగా పౌరులు చనిపోయారని, 1,100 మంందికి పైగా ప్రజలు గాయపడ్డారని ఉక్రెయిన్‌ ప్రభుత్వ అధికారి ల్యూడిమియా డెనిసోవా వెల్లడించారు. ఊహకందని క్రౌర్యంతో శత్రు సేనలు జనావాసాలు, హాస్పిటల్స్‌, పాఠశాలల మీద దాడులు చేస్తున్నాయన్నారు. ఉక్రెయిన్‌ గడ్డ మీద పుట్టిన ప్రజలు జీవించే హక్కును ధ్వంసం చేస్తున్నాయని వివరించారు. చిన్న పిల్లలు కూడా ఈ దాడుల్లో చనిపోతున్నారని చెప్పిన డెనిసోవా.. కీయెవ్‌ ఆస్పత్రిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ఖార్కియెవ్‌ నగరంలోని ఓ భవనం మీద జరిగిన దాడిలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ నేరాలకు రష్యాను తీవ్రంగా శిక్షించాలని ఆమె అన్నారు. ఈ దారుణ వాస్తవాలను ఉక్రెయిన్‌ నోట్‌ చేస్తోందని, వాటిని హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయ స్థానంలోని మిలటరీ ట్రిబ్యునల్‌కు నివేదిస్తామని ఆమె తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement