Sunday, May 5, 2024

క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం జీఎస్టీ.. మంత్రుల కమిటీ ప్రతిపాదన

క్యాసినో , ఆన్‌ లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందెలపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం సూచించింది. ఈ వారంలో సమావేశం కానున్న జీఎస్టీ మండలి ఈ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మేఘాలయా ముఖ్యమంత్రి సంగ్మా ఆద్వర్యంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం వీటిపై పూర్తి స్థాయిలో జీఎస్టీ విధించాలని సూచించింది. గేమ్‌లో పాల్గొనే ప్లేయర్స్‌ చెల్లించే ఎంట్రీ ఫీజుపై కూడా ఈ మేరకు 28 శాతం జీఎస్టీని విధించాలని కోరింది. రేస్‌ కోర్స్‌లో జరిగే పందెలపైనా, బుక్‌ మేకర్స్‌ పై జీఎస్టీ విధించాలని సూచించింది. క్యాసినోలో పాల్గొనే వారు కొనుగోలు చేసే చిప్స్‌, కాయిన్స్‌ పై పూర్తి జీఎస్టీ విధించాలని కోరింది. బెట్లు కట్టే మొత్తంపైనా, ప్లేయర్‌ గెలుచుకున్న మొత్తంపై ఎలాంటి జీఎస్టీ విధించవద్దని సూచించింది.

క్యాసినోలోకి ఎంట్రీ కోసం కొనుగోలు చేసే టిక్కెట్లు, అక్కడ సరఫరా చేసే డ్రింక్స్‌, ఫుడ్‌ ఐటమ్స్‌ పై కూడా 28 శాతం జీఎస్టీ ఉండాలని మంత్రుల బృందం సూచించింది. ప్రస్తుతం క్యాసినో, ఆన్‌లైన్‌ గేమింగ్‌, హార్స్‌ రేసింగ్‌పై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. గత సంవత్సరం వీటి వాస్తవ విలువను లెక్కించి, ఎంత పన్ను వేయాలన్న దానిపై ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వీటిపై 28 శాతం జీఎస్టీ విధిస్తే, పొగాకు, పాన్‌ మసాలా, ఎరెటేడ్‌ వాటర్స్‌ తో సమానంగా జీఎస్టీ విధించినట్లు అవుతుంది. అధిక పన్నులు విధించడం వల్ల అనధికారంగా వీటిని నిర్వహించే ప్రమాదం ఉందని, ఇది బ్లాక్‌ మార్కెట్‌కు దారి తీసుందని కొంత మంది హెచ్చరిస్తున్నారు. ఈ నెల 28,29 తేదీల్లో ఛండిఘర్‌లో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement