Monday, April 29, 2024

2వేల సంవత్సరాల నాటి ఇటుక గోడలు.. పట్నాలో కనుగొన్న ఆర్కియాలజీ సర్వే

పట్నా: సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్న ప్రాచీన, పురాతన ఇటుక గోడలు గురువారం బీహార్‌ లోని పట్నాలో బైట పడ్డాయి. ఆర్కియాలజీ పట్నా సర్కిల్‌ అధికారులు కుమ్రహర్‌ ప్రాంతంలో ఒక చెరువును పునరుద్ధరిస్తుండగా, ఈ పురాతన ఇటుకగోడలు బైట పడ్డాయి. ఈ గోడలు సుమారు రెండు వేల సంవత్సరాల నాటివని ఆర్కియాలజీ విభాగం అధికారులు భావిస్తున్నారు. ఈ పురాతన ఇటుక గోడలపై ఏఎస్‌ఐ పట్నా సర్కిల్‌ సూపర్నెంట్‌ గౌతమి భట్టాచార్య శనివారం పట్నాలో మీడియాతో మాట్లాడారు. గతంలో మౌర్యుల రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు వెలుగు చూసిన కుమ్రహర్‌లో ఆర్కియాలజీ సిబ్బంది గురువారం తవ్వకాలు జరిపిందని భట్టాచార్య వెల్లడించారు. ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అమృత్‌ సరోవర్‌ కింద సంరక్షిస్తున్న నీటి చెరువు ఉందని ఆయన వెల్లడించారు. ఆసమీపంలోనే ఈ ఇటుక గోడలు బైట పడినట్లు ఆయన వెల్లడించారు. ఈ గోడలు చాలా పురాతనమైనవిగా ఆర్కియాలజీ విభాగం గుర్తించిందని ఆయన ప్రకటించారు.

ఈశాన్య భారతదేశాన్ని పరిపాలించిన కుషన్‌ యుగం నాటికి చెందిన ఇటుకలుగా వాటిని గుర్తించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్‌, మధ్య ఆసియాలో ఉందని ఆయన వెల్లడించారు. కుషన్‌ రాజులు క్రీపూ 30 నుంచి 375 వరకు పరిపాలించారని ఆయన చెప్పారు. అయితే, ఈ ఇటుక గోడలపై పూర్తి అధ్యయనం తర్వాతనే వాటి వయసును నిర్థారించడం జరుగుతుందని భట్టాచార్య స్పష్టం చేశారు. న్యూఢిల్లిలోని ఆర్కియాలజీ విభాగం ఉన్నతాధికారులకు సైతం ఇటుక గోడలపై సమాచారం ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. బీహార్‌లో కేంద్ర ప్రభుత్వం మిషన్‌ అమృత్‌సరోవర్‌ పథకం ద్వారా సంరక్షణ చేపట్టిన 11 చెరువులను ఏఎస్‌ఏ పట్నా శాఖ పునరుద్దరిస్తోందని ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement