Saturday, May 18, 2024

నెలలో 11 లక్షల కోట్ల సంపద అవుట్‌.. ఆగని అదానీ కంపెనీల షేర్ల పతనం

అదానీ గ్రూప్‌ పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలతో నెలరోజుల్లోనే ఆ కంపెనీలు దారుణంగా నష్టపోయాయి. స్టాక్‌ మార్కెట్‌లో అదానీ కంపెనీల షేర్లు భారీ పతనంతో 11 లక్షల కోట్లకుపైగా సంపద అవిరైంది. జనవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడే నాటికి 10 అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల మార్కెట్‌ విలువ 19.2 లక్షల కోట్లుగా ఉంది. ఫిబ్రవరి 20 నాటికి ఈ విలువ 8.2 లక్షల కోట్లకు పడిపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌ షేర్లు మంగళవారం నాడు 5 శాతం తక్కువగా లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. అదానీ పవర్‌ మాత్రం 5 శాతం మెరుగుపడింది. ఏసీసీ, అంబుజా సిమెంట్స్‌ షేర్లు కూడా మెరుగ్గానే ట్రేడయ్యాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన నాటి నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 61 శాతం తగ్గింది. అత్యధిక ఆదాయం తీసుకువస్తున్న అదానీ పోర్టు షేర్‌ విలువ 40 శాతం తగ్గింది.

- Advertisement -

పడిపోతున్న షేర్‌ విలువను నిలబెట్టుకునేందుకు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్‌ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సోమవారం నాడు 15,00 కోట్లు చెల్లించింది. మార్చిలో కమర్షియల్‌ పేపర్స్‌కు చెల్లించాల్సిన 1000 కోట్లు కూడా చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపునాటికి 5 వేల కోట్ల రుణాలను చెల్లిస్తామని కూడా అదానీ గ్రూప్‌ ప్రకటించింది. అత్యంత వేగంగా అదానీ గ్రూప్‌ 2.25 లక్షల కోట్లు రుణాలు తీసుకుంది. మార్కెట్‌లో ఉన్న కంపెనీలను కొనుగోలుకు ఈ రుణాలను ఎక్కువగా వినియోగించింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తరువాత ప్రస్తుతం కోల్పోతున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నగదు పరిరక్షణ, రుణాల చెల్లింపులు, తాకట్టులో ఉన్న షేర్లను విడిపించడంపై దృష్టి సారిస్తోంది. మంగళవారం నాడు అదానీ గ్రూప్‌లో 10 కంపెనీల విలువ స్టాక్‌ మార్కెట్‌లో 100 మిలియన్‌ డాలర్లలోపుకి దిగజారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement