Friday, May 17, 2024

పుదుచ్చేరి : కమల వ్యూహంలో పుదుచ్చేరి!

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • బల నిరూపణకు ముందే సీఎం నారాయణ స్వామి రాజీనామా
  • వేగంగా నాటకీయ పరిణామాలు
  • సభ్యుల రాజీనామాలు వ్యూహాత్మకం
  • ఆపై కిరణ్‌బేడీ తొలగింపు
  • చతురత ప్రదర్శించిన కేంద్రం
  • తన పాత్ర లేదని నమ్మించే యత్నం
  • ఇక భాజపా కనుసన్నల్లోనే త్వరలో జరుగనున్న పుదుచ్చేరి ఎన్నికలు

రెండు, మూడు మాసాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న పుదు చ్చేరిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌బేడీని అకస్మాత్తుగా తప్పించారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్‌ తమిళసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతకుముందే అధికార కాంగ్రెస్‌ నుంచి వరుసగా నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకొచ్చారు. ఆ తర్వాత మిత్రపక్షం డీఎంకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ముఖ్యమంత్రి నారాయణసామి ప్రభుత్వం మైనారిటీ లో పడింది. శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ సోమవారం బల నిరూపణకు ముందే ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఆ తర్వాత పరిణా మాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికిప్పుడు గవర్నర్‌ ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్స్‌ చేస్తారా.. లేక ప్రతిపక్ష నాయకుడు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రంగసామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తారా.. అదీకాక ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమంటూ నారాయణసామికే సూచిస్తారా.. అన్నది ఇంతవరకు తేలలేదు. ముఖ్యమంత్రి రాజీనామా అనంతరం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే ప్రస్తుత పరిస్థితి మొత్తం కేంద్ర అధీనంలోకి వెళ్ళిపోయింది. పుదుచ్చేరిపై బీజేపీ పరోక్ష పెత్తనం మొదలైంది. ఎన్నికలు తొందరలోనే ఉన్నందున అంతవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నారాయణసామినే కొనసాగించే యోచన తమిళసైకుంటే ఆ విషయాన్ని రాజీనామా సమర్పించిన సమయంలోనే చెప్పుండేవారు. కానీ దీనిపై ఆమె ఎలాంటి స్పష్టతనివ్వలేదు. అలాగే ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారన్న ప్రచారాన్ని కూడా విమర్శకులు కొట్టిపారేస్తున్నారు. నేరుగా బీజేపీ పెత్తనంలోనే పుదుచ్చేరి ఎన్నికలు జరగాలన్నది కేంద్ర అభిమతంగా పేర్కొంటున్నారు. పుదుచ్చేరిలో మొత్తం అసెంబ్లిd స్థానాలు 30. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 15స్థానాలొచ్చాయి. డీఎంకేకు 3స్థానాలొచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ డీఎంకేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ నుంచి నలుగురు, డీఎంకే నుంచి ఇద్దరు రాజీనామాలు చేయడంతో కూటమి బలం 12కి పడిపోయింది. అయితే అధికార కూటమిలో అంతర్గత కలహాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పని చేసిన కిరణ్‌బేడీయే కారణమని నారాయణసామి ఆరోపించారు. పుదుచ్చేరి రాజకీయాల్లో గవర్నర్‌ పెత్తనం శృతిమించిందంటూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు దేశాధ్యక్షుడు రామనాధ్‌ కోవింద్‌లను కలుసుకుని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే కిరణ్‌బేడీని కేంద్రం అకస్మాత్తుగా గవర్నర్‌ పదవి నుంచి తొలగించింది.
పుదుచ్చేరి దక్షిణాదినున్న ఓ చిన్న రాష్ట్రం. స్వాతంత్య్రానికి ముందు ఈ ప్రాంతం ఫ్రెంచ్‌ పాలనా పరిధిలో ఉండేది. స్వాతంత్య్రానంతరం ఇది భారత రిపబ్లిక్‌లో విలీనమైంది. దీర్ఘకాలం పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంగానే కొనసాగింది. కొన్నేళ్ళ క్రితమే దీనికి రాష్ట్ర హోదా కల్పించారు. అయినప్పటికీ ఇతర రాష్ట్రాల తరహాలో దీనికి పూర్తి హక్కులుండవు. ఇక్కడ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వానికి ఆధిపత్యం వహిస్తారు. సహజంగా పదవీ విరమణ చేసిన సైనికాధికార్లు, ఐపీఎస్‌ అధికార్లను లెఫ్టినెంట్‌ గవర్నర్‌లుగా నియమిస్తారు. అసెంబ్లిd, దానికి ఎన్నికలు, సమావేశాలు, నిర్ణయాలు ఇలా ఇతర రాష్ట్రాల తరహాలో కార్యకలాపాలు జరిపినప్పటికీ కీలక నిర్ణయాలన్నీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదముద్రకు అనుగుణంగానే అమల్లోకొస్తాయి. ముఖ్యంగా శాంతిభద్రతల నియంత్రణ పూర్తిగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అదుపాజ్ఞలకు లోబడి ఉంటుంది. అలాగే ఆర్థిక, రెవెన్యూ, ప్రజాసంక్షేమం అంశాల్లో పెత్తనం అధికంగా ఉంటుంది. ఢిల్లిd రాష్ట్రం కూడా ఇలాంటిదే. ఢిల్లిd అసెంబ్లిd ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన కిరణ్‌ బేడీకి ఆ అవకాశం దక్కకపోవడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమెను పుదుచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పంపించారు. సహజంగానే శతృపక్షమైన కాంగ్రెస్‌ పాలనలోనున్న పుదుచ్చేరిలో రాజకీయ అలజడులు సృష్టించడం, పాలకపక్షాలకు తలనొప్పులు కలిగించే లక్ష్యంతోనే కిరణ్‌బేడీని ఇక్కడకు పంపించారు. ఇతర గవర్నర్లతో పోలిస్తే లెఫ్టినెంట్‌ గవర్నర్లకున్న అధికారాలు ఎక్కువ. అలాగే వారి వ్యవహారశైలి కూడా భిన్నంగా ఉంటుంది. సహజంగా సైన్యం, లేదా ఐపీఎస్‌ ఉద్యోగాల్లో పదవీ విరమణ చేసిన వ్యక్తులు కావడంతో లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఇప్పటికీ తమ ఆదేశాల్ని ప్రతి ఒక్కరు తలొగ్గి శిరసా వహించాలన్న ఆలోచనలో ఉంటారు. తాము మాత్రమే ఖచ్చితమని, ఎదుటి వ్యక్తులు చేస్తున్నవి తప్పులన్న భ్రమలో ఉంటారు. ఇతరులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు మొగ్గుచూపుతారు. కిరణ్‌బేడీ కూడా ఇవన్నీ చేశారు. ఆఖరకు ప్రభుత్వ పథకాల అమల్లో కూడా చేతులెట్టారు. తనకు ఇష్టం లేని పథకాల్ని నిర్ద్వందంగా నిలిపేశారు. అలాగే ఉద్యోగుల బదలీలు కూడా తన కనుసన్నల్లోనే నిర్వహించేలా పట్టుబట్టారు. బియ్యం, ఇళ్ళు, స్థలాల పంపిణీ నుంచి అభివృద్ధి పనులకు శంకుస్థాపనల వరకు ప్రతి కార్యక్రమంపైన తన అజమాయిషీని ప్రదర్శించారు. దీంతో సహజంగానే ప్రభుత్వానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య విబేధాలు పెరిగాయి. పరస్పర దూషణలు, ఆరోపణలు జరిగాయి. దీన్ని సాకుగా తీసుకుని కిరణ్‌బేడీ కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఒత్తిళ్ళు తెచ్చి పార్టీ నుంచి రాజీనామాలు చేయించారన్నది నారాయణసామి ఆరోపణ. ఈ అంశాన్ని కేంద్రం మరింతగా తనకనుకూలంగా మార్చుకుంది. చివరి నిమిషంలో బేడీని పక్కనపెట్టి రాజకీయ చతురత కలిగిన తమిళసైకి ఆ బాధ్యతలు అప్పగించింది. తద్వారా విపక్ష ఏలుబడిలోని ప్రభుత్వాన్ని పడగొట్టడంలో ప్రత్యక్షంగా తమ పాత్ర లేదని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement