Wednesday, May 1, 2024

నేటి సంపాదకీయం-పెళ్లీడు వచ్చేసింది!

అన్ని రంగాల్లో మహిళలకు పురుషులతో సమానావకాశాలు కల్పిస్తున్న ప్రస్తుత సమాజంలో పెళ్ళీడుకు కూడా సమాన వయసును పాటిస్తే తప్పేమిటన్న ప్రశ్న మహిళా సంఘాల నుంచి చాలా కాలంగా వినిపిస్తోంది. ఎప్పుడో పాత కాలం నాటి నియమనిబంధనలనూ, చట్టాలనూ ఇప్పటికీ కొనసాగిస్తూ మహిళల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు అవరోధం కలిగించడం ఏపాటి న్యాయమని మహిళా సంఘాలు చాలా కాలంగా ప్రశ్నిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఆడపిల్లల పెళ్ళీడు వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఇది మహిళా సాధికారతలో మరో ముందడుగు. ఆ బిల్లు వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌ తదితర పార్టీల పేరు ప్రస్తావించకుండా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారంనాడు ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన భారీ మహిళా సదస్సులో మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ఆడపిల్లలు గతంలో మాదిరిగా 18 సంవత్సరాలకు పెళ్ళి చేసుకునేందుకు ఇష్టపడటం లేదనీ, పెద్ద చదువులు చదివి, పెద్దఉద్యోగాలు చేయాలన్న ఆకాంక్షతో ఉన్నారనీ, వారి కోసమే ఇందుకు సంబంధించిన చట్టసవరణ బిల్లును ప్రవేశ పెట్టామని వివరించారు. మహిళలకు సమానావకాశాల కోసం మోడీ ప్రభుత్వం చితశుద్ధి తో కృషి చేస్తున్న మాట నిజమే. ఇందుకు తలాక్‌ రద్దు బిల్లును పార్లమెంటు చేత ఆమోదింప జేయడమే నిదర్శనం. దశాబ్దాలుగా తలాక్‌ రద్దు విషయంలో ముందడుగు వేసేందుకు ఏ ప్రభుత్వమూ చొరవ తీసుకోలేదు. మతపరమైన ఉద్వేగాలు పెల్లుబుకుతాయేమోనని ప్రభుత్వాలువెనకడుగు వేశాయి. అయితే, ఇది మత పరమైనది కాదనీ, స్త్రీ, పురుషుల సమానహక్కులకు సంబంధించినదని అందరినీ ఒప్పించడంలో మోడీ కృతకృత్యులయ్యారు. అదే మాదిరిగా ఇప్పుడు ఆడపిల్లల పెళ్ళీడుకు వయసును పెంచే విషయంలో ప్రభుత్వం అన్ని వర్గాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆడపిల్లల చదువులపై ఆంక్షలు అమలులో ఉన్న రోజుల్లో పెళ్ళీడు వయసును 18 సంవత్సరాలుగా నిర్దారించారు.

ఇప్పుడు అలాంటి ఆంక్షలు ఏమీ లేవు. పీజీ కోర్సులు, వృత్తి విద్యా కోర్సుల్లో వారు మగవారితో పోటీ పడుతున్నారు. డాక్టర్లుగా, విద్యావేత్తలుగా మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో రాణిస్తున్నారు. అమెరికాలో భారతమహిళలు పలు రంగాల్లో ఉన్నత పదవులను అలంకరిస్తున్నారు. తమకు సరైన అవకాశాలు కల్పిస్తే ఎంతవరకైనా అభివృద్ధిని సాధించగలమని నిరూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆడపిల్లలకు 18 ఏళ్ళకే పెళ్ళి చేసేసి అత్తారింటికి బలవంతంగా పంపించేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఆడపిల్లలకు కూడా ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు ఉంటాయని సమాజం గుర్తించాలని మహిళా సంఘాలు గళమెత్తుతున్నాయి. సమాజంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని స్పందించడం ప్రభుత్వ లక్ష్యమే కాదు బాధ్యత కూడా.

మోడీ ప్రభుత్వం చేస్తున్నది అదే. అయితే, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను సాకుగా చూపించి వారికి నిర్ణీత వయసులో పెళ్ళి చేసి పంపేస్తేనే నయమని వాదించేవారున్నారు. అలాంటి వారిది పలాయనవాదం. ఆడ పిల్లలు గతంలో మాదిరిగా మగవారి దౌర్జన్యాలకూ, దాడులకూ తలొంచే పరిస్థితులు ఈనాడు లేవు. ధైర్యంగా ఎదిరిస్తున్నారు. పోలీసు స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పోలీసు శాఖలో ఇందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పరిచాయి. రోడ్డు మీద ఆడపిల్లలను వేధించే ఆకతాయిలను అక్కడికక్కడే పట్టుకుని పోలీసులు కేసులు పెడుతున్నారు. అన్నింటి కన్నా ఆడపిల్లల్లో ప్రశ్నించే ధైర్యం, ఫిర్యాదుచేసే చొరవ ఈరోజులలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది సమాజ పురోగతికి నిదర్శనం. పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఆడపిల్లలు తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని తల్లితండ్రులను కోరుతున్నారు. సమాజంలో వచ్చిన మార్పు ఇది. తమ ఆడపిల్లలు పెద్ద చదవులు చదివి ఉద్యోగాలు చేయాలని వారూ కోరుకుంటున్నారు. ఇలాంటి నేపధ్యంలో ఇంకా పాత కాలం నాటి చట్టాలను పట్టుకుని వేళ్ళాడటం యోగ్యత అనిపించుకోదు. పైగా ఇది ఆడపిల్లల స్వేచ్ఛకు సంబంధించిన విషయం. వారిని బలవంతంగా ఒప్పించడం సమంజసం కాదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement