Friday, April 26, 2024

నేటి సంపాదకీయం – ఆర్థిక వ్య‌వ‌స్థ ఆశావాహం..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరం ఆర్థిక సర్వేని సోమవారం పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బుధవారం ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌ ఎలా ఉంటుందో ఆర్థిక సర్వేలోని అంశాలను సంకేతాలుగా భావించవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తరచూ ప్రస్తావించే ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను మరో రెండేళ్ళలో చేరుకోవాల్సి ఉంది. గడిచిన రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి వల్ల ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా తీవ్రమైన కష్టనష్టాలకు లోనవుతోంది. అయినప్పటికీ మన ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడింది. కరోనాని ఎదుర్కోవడం లో విజయం సాధించింది. కరోనా నియంత్రణకు వినియోగించే వ్యాక్సిన్లలో మూడు వ్యాక్సిన్లు మనదేశంలోనే తయారవుతున్నాయి. ఫార్మా రంగంలో మన దేశం ఎఫ్‌డిఐలను ప్రోత్సహించడం వల్లనే మూడు వ్యాక్సిన్లను తయారు చేయగల స్థాయికి మన దేశం చేరుకుంది. ఈ మూడు కాకుండా మరో ఐదు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. ఫార్మారంగంలో భారత్‌ సాధించిన అభివృద్ధిని చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఫార్మా రంగంలో అధిక శాతం ఎఫ్‌డిఐలను ఆహ్వానించడంతో గత ఏడాది ఐదు మాసాల వ్యవధిలోనే 4,500కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చి మన ఆర్థిక వ్యవస్థలో చేరాయి. రానున్న కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆర్థిక సర్వేలోమంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలకు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా నాలుగులైన్లు, ఆరు లైన్ జాతీయ రహదారులను స్వర్ణముఖి చతుర్భుజి పేరిట అభివృద్ది పర్చారు. మౌలిక సదుపాయాలను వృద్ది చేయడంలో భాగంగానే ఎయిర్‌ ఇండియాను టాటా సంస్థకు విక్రయించారు. దీని వల్ల పర్యాటక రంగానికి ఊపు రానున్నది.

అయితే, కరోనా కారణంగా పర్యాటక రంగం గత రెండు సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే, ఇది మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో పర్యాటక రంగం ఈ మాదిరిగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం కరోనా సమయంలో కూడా బాగా పుంజుకుంది. 2019-20లో 10,237 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించగా,2020-21లో 13,232 కిలోమీటర్ల రహదారులను నిర్మించారు. ఏ దేశంలోఅయినా అభివృద్ది అనేది మౌలిక సౌకర్యాల కల్పనను బట్టే నిర్ధారిస్తారు. మారు మూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో కలిపే కార్యక్రమాన్ని కూడా వాజ్‌పేయి హయాంలో చేపట్టారు. దేశంలో75 పైగా కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చి 89,066కోట్ల రూపాయిలను సేకరించాయని ఆర్థికమంత్రి వివరించారు. ఐపీవోల వల్ల ఆర్థికవ్యవస్థ మరింత బలపడుతుంది. స్టార్ట్‌ అప్‌లు పెరగడంతో ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయని ఆర్థికమంత్రి వివరించారు. కరోనా కారణంగా పరిశ్రమలు, కంపెనీల్లో లాక్‌డౌన్‌లు ప్రకటించినా, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్దతిలో పని చేసుకునేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పించడం వల్ల ఐటి రంగంలోనూ, అనుబంధ రంగాల్లోనూ అభివృద్ధి కుంటుపడలేదు.

గృహ నిర్మాణ రంగంలో విక్రయాలు తగ్గినా, ధరలు తగ్గకపోవడం గమనార్హం. కరోనా రెండవ దశలో విక్రయాలు పెరిగాయి. అలాగే, కరోనా నియంత్రణకు మన దేశంలో తయారైన టీకాలు మాత్రమే కాకుండా ఫైజర్‌, జాన్సన్‌ వంటి విదేశీ టీకాలను దేశంలో 156 డోస్‌ల మేరకు పంపిణీ చేశారు. టీకాల విషయంలో మన దేశం రికార్డు సృష్టించింది. మన దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జోరుగా జరగడం వల్ల ఒమిక్రాన్ విజృంభణ ప్రభావం ఎక్కువగా కానరాలేదు. ఆర్థికరంగం పుంజుకుందనీ, వస్తు, సేవా పన్ను వసూళ్ళు పెరిగాయనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు 9 శాతంఉండవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు.
కరోనా ప్రభావం మన ఆర్థిక రంగంపై ఉంటుందన్న భయాలు ఉన్నప్పటికీ, విదేశీ మారక ద్రవ్యనిల్వలు
భారీగా ఉన్నందువల్ల ఆర్థిక వ్యవస్థకు ఢోకాలేదని ఆర్థిక మంత్రి అన్నారు. ఒడిదుడుకుల మధ్య కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఆశావహంగా ఉందనడానికి ఇదే నిదర్శనం. ప్రైవేటు రంగానికి అవకాశాలు పెంచడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుకు యత్నాలు సాగిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement