Tuesday, May 21, 2024

నేటి సంపాద‌కీయం.. నేర రాజ‌కీయీల‌కు చెక్

నేరస్థులు నేతలుగా ఎదిగి చట్టసభలకు ఎన్నికయ్యే దౌర్భాగ్యం నుంచి భారతావని బయటపడగలదా..? రాజకీయాలలోకి నేరస్థుల ప్రవేశాన్ని కట్టడి చేయడానికి కొన్నాళ్లుగా న్యాయవ్యవస్థ ప్రయత్నిస్తున్నది. అయినా.. ఏ యేటికాయేడు చట్టసభలకు ఎన్నికవుతు న్న నేరస్థుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత జస్టిస్‌ రమణ ఈ ధోరణి పట్ల ఎంతో అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణ కొన్ని దశాబ్దాల పాటు కొనసాగడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసుల సత్వర విచారణకు సంబంధించి అనేక మార్గ దర్శకాలు కూడా జారీ చేశారు. వీటిని ఏడాదిలోగా పరిష్కరించాలని కూడా సూచించారు. కానీ.. ఈ పెడధోరణి కళ్లెం వేయడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. పైగా నేరస్థులకు సీట్లు కేటా యించడాన్ని మరింత పెంచాయి. తాజాగా యూపీలో జరుగనున్న రెండవ విడత పోలింగ్‌లో పోటీ చేస్తున్న వారిలో 25 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) తెలిపింది. 2018లో చట్టసభల సభ్యులపై నమోదైన కేసుల సంఖ్య 4,110 ఉండగా… 2021 డిసెంబర్‌ నాటికి వీటి సంఖ్య 4,984కు చేరుకున్నది. వీటిల్లో కొన్ని కేసులు మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. 2,324 కేసులు ప్రస్తుత చట్ట సభల సభ్యులపై నమోదైనవి కాగా… 1675 కేసులు మాజీ ప్రజాప్రతినిధులపై నమోదైనవి. 1991 కేసులలో ఇంకా అభియోగాలే నమోదు కాలేదు. వివిధ హైకోర్టులు స్టే విధించడంతో 264 కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ 1339 కేసులతో అగ్రస్థానంలో ఉంది. రాజకీయ పార్టీలకు నేరస్థులకు మధ్య ఉన్న అనుబంధం నానాటికీ బలపడుతున్నదన్న చేదు వాస్తవాన్నే ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే చట్టసభల సభ్యులపై కేసులను సత్వరం విచారించాలన్న పిటిషన్‌ మంగళవారం నాడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ధర్మాసనం అత్యవసర విచారణకు అంగీకరించింది. సీనియర్‌ న్యాయవాది, కోర్టు సహాయకులు విజయ్‌ హన్సారియా ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసుల వివరాలతో కూడిన తాజా నివేదికను ఆయన దీనికి జత చేశారు. నేరస్థులు రాజకీయాలలోకి ప్రవేశిం చకుండా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్న హన్సారియా సూచన పరిశీలించ దగినదే. సీబీఐ తదితర ఏజెన్సీల ద్వారా దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన సూచించారు. అయితే ఈ కేంద్ర దర్యాప్తు సంస్థ పనితీరు చానాళ్ల క్రితమే మసకబారింది. అధికార పక్షం చేతిలో ఇది కీలబొమ్మగా మారిందన్న విమర్శలు ఈ మధ్య కాలంలో వెల్లు వెత్తాయి. నేతలే నిందితులైన కేసుల్లో సీబీఐ దర్యాప్తు తీరు సామాన్యులకు సైతం వెగటు పుట్టిస్తున్నది. దశాబ్దాలు దాటినా నేరచరితగల నాయకులపై అభియోగ పత్రాలు సైతం దాఖలు చేయని నిర్వాకం ఈ సంస్థది. ఈ విషయంలో సుప్రంకోర్టు ఇప్పటికే పలుమార్లు సీబీఐ పనితీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినా దాని వైఖరిలో మార్పు లేదు. అది పాలకపక్షాలకు వంతపాడినంత కాలం దానినుంచి అద్భుత ఫలితాలు ఆశించలేం. కాగ్‌ తరహాలో దానికి స్వతంత్ర హోదా కల్పించి, పార్లమెంట్‌కు జవాబుదారీ ని చేస్తే తప్ప నేతల కేసుల విచారణలో వేగం పెరగదు.

అయితే… దానికి ఆ హోదా కల్పించాల్సింది పాలకపక్షమే. అందుకు ఏ పార్టీ అంగీకరిస్తుంది? అసలు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాన్ని నేరస్థులకు ఎందుకివ్వాలని సుప్రీంకోర్టు నాలుగేళ్ల క్రితమే ఆయా పార్టీలను నిలదీసింది. అభ్యర్థులపై పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని 2020లో అన్ని పార్టీల ను ఆదేశించింది. అయితే.. కొందరు నేతలు ఈ వివరాలను సైతం ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చివరకు కొందరు నాయకులు రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమపై నమోదైన కేసులను ఉపసంహరింప చేసుకుంటున్నారు. దీంతో సంబంధిత హైకోర్టు అనుమతి లేకుండా ఇలాంటి కేసులను ఉపసంహరించకూడదని న్యాయస్థానం ఆదేశించాల్సి వచ్చింది. నేతలపై ఉన్న పెండింగ్‌ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతున్నదో తెలుసుకోవడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని 2018లోనే కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే… ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమేదీ జరగలేదు. రాజకీయ చిత్తశుద్ధి ఉంటే తప్ప నేరమయ రాజకీయాలకు చెక్‌ పెట్టడం సాధ్యం కాదు. అయితే… పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement