Tuesday, May 7, 2024

Editorial – బిజెపితో డిఎంకె ఢీ…

మనీ ల్యాండరింగ్‌ కేసులో ఢిల్లి మంత్రి సత్యేంద్ర జైన్‌ గడిచిన కొద్ది మాసాలుగా జైలులో ఉన్నారు. ఆయనకు హృద్రోగ సమస్యలు తలెత్తడంతో కోర్టు కొంతకాలం తాత్కాలిక బెయిల్‌ ఇచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడు మంత్రి సెంథిల్‌ బాలాజీకి వచ్చింది. ఆయన కుటుంబం నిర్వహిస్తున్న సంస్థలు మనీ ల్యాండరింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. దాంతో ఆయనకు గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అత్యవసరంగా బైపాస్‌ సర్జరీ చేయాలని వైద్యులు ప్రకటించారు. ఈ రెండు సంఘటనల్లోనూ మంత్రులు బీజేపీయేతర పార్టీలకు చెందినవారే. దీంతో ఈ ఘటనలను రాజకీయంగా వినియోగించుకోవడానికి బీజేపీయేతర పార్టీలు చూస్తున్నాయి. చట్టం తన పని తాను చేసుకుని పోతోందనీ, ఇందులో రాజకీయ కక్ష ఏమాత్రం లేదని బీజేపీ నాయకులు తిప్పికొడుతున్నారు. అయితే, ఈడీ.. సీబీఐ నిర్వహించే దాడులన్నీ బీజేపీయేతర పార్టీల నాయకుల ఇళ్ళు, ఆఫీసులపైనే కేంద్రీకృతం కావడంతో ఇది కచ్చితంగా రాజకీయ కక్షేనని బీజేపీయేతర పార్టీలు వాదిస్తున్నాయి.

వాటితో వామపక్షాలు గొంతుకలి పాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలు గతంలో కూడా ఇదే మాదిరిగా దాడులను నిర్వహించాయి. ఇప్పటికీ నిర్వహి స్తున్నాయి. కానీ, రాజకీయ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని అధికారంలోఉన్న వారు ఈ దాడులు జరిపిస్తున్నారన్న అపవాదు ఇప్పుడే వచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డీఎంకె మంత్రి ఎ.రాజా, ఆ పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి అరెస్టు అయి జైలులో ఉన్నారు. ఇప్పుడు అరెస్టు అవుతు న్న వారంతా ప్రతిపక్షాలకు చెందినవారే కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి. బీజేపీయేతర పార్టీల నాయకులు ఇటీవల రాష్ట్రపతికి సంయుక్తంగా ఒక లేఖ రాశాయి. ఈడీ, సీబీఐలు ప్రభుత్వ సంస్థలే అయినా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న అపవాదు కూడా వచ్చింది. ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చినా, ఇప్పుడుఎక్కువగా ఉంటున్నాయన్నది బీజేపీయేతర పార్టీల అభిప్రాయం.

మనీ ల్యాండరింగ్‌ కేసులు కూడా గతంలోకన్నా ఎ క్కువగా పెరిగిపోయాయి. గతంలో పెద్ద పారిశ్రామికవేత్తలు, వాణిజ్య వేత్తలపై మాత్రమే ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సాధారణంగా ఓ స్థాయిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారందరిపై ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనసంఘ్‌, సోషలిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు కాంగ్రెస్‌ అవినీతిని ఎండగట్టేవి. ఇప్పుడు బీజేపీ అవినీతిపై కాంగ్రెస్‌ ధ్వజమెత్తుతోంది. అవినీతి విషయంలో ఈ రెండు పార్టీలకూ తేడా లేదని ఆ పార్టీల వారే బహిరంగంగానే ఆరోపమలు చేసుకుంటున్నారు. ఇంతకీ సెంథిల్‌ బాలాజీ అరెస్టుపై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకె కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.ఈడీ మోపిన కేసుల దర్యాప్తునకు సహకరిస్తానంటున్నప్పుడు మంత్రి సెంథిల్‌ బాలాజీని అరెస్టు చేయడాన్ని డీఎంకె నాయకుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ప్రశ్నిస్తున్నారు.ఈడీ అధికారులు సాధారణ రీతిలో కాకుండా అసాధారణ రీతిలో ప్రశ్నించి హింసించడం వల్లనే ఆయన ఈసీజీలో తేడా వచ్చిందని డీఎంకె ప్రతినిధి శేఖర్‌బాబు ఆరోపించారు. దీనిపై డీఎంకె యువ నాయకుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ బీజేపీ ఒత్తిడులకూ, హింసలకూ తమ పార్టీ తలొగ్గబోదని స్పష్టం చేశారు. ఆయన తండ్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ మరింత ఘాటుగా స్పందించారు. సెంధిల్‌ బాలాజీ అన్నాడీఎంకెలో ఉన్నప్పుడు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలన్నీ అప్పటివే. బీజేపీతో సాన్నిహిత్యం ఉన్నంత కాలం ఆయన జోలికి కేంద్రం వెళ్ళలేదు. ఇప్పుడు స్టాలిన్‌ నాయకత్వంలో డీఎంకెలో చేరినందుకు కక్షకట్టారని డీఎంకె నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన రాజకీయాలనే ఇప్పుడు బీజేపీ అనుసరిస్తోందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. సెంధిల్‌ బాలాజీ అరెస్టు వ్యవహారం తమిళనాడులో తీవ్ర కలకలాన్ని రేపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement